ప్రసూబేబీ.. నటనే హాబీ! | Madanapalli Prashanth Success Story | Sakshi
Sakshi News home page

ప్రసూబేబీ.. నటనే హాబీ!

Published Sun, Jun 9 2024 12:20 AM | Last Updated on Sun, Jun 9 2024 10:18 AM

Madanapalli Prashanth Success Story

‘సోషల్‌ మీడియా’ సూపర్‌స్టార్‌ ప్రశాంత్‌

‘ప్రసూ బేబీ’గా యూట్యూబ్‌లోసంచలనం

8.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఇన్‌స్ట్రాగామ్‌ను సైతం షేక్‌ చేసిన వైనం

మదనపల్లె విద్యార్థి విజయగాథ

మదనపల్లె సిటీ: అవును అతడు సోషల్‌ మీడియా సూపర్‌స్టార్‌. యూట్యూబ్‌లో 8.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో భారీ ఫాలోయింగ్‌. ప్రసూబేబిగా సూపర్‌ ఫేమస్‌. చదివింది ఎంటెక్‌. ప్రయత్నిస్తే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నత ఉద్యోగం వస్తుంది. లక్షలాది రూపాయల జీతం లభిస్తుంది. కానీ అతను అందరూ వెళ్లేదారిలో కాకుండా తనకంటూ ప్రత్యేక మార్గం ఉండాలని భావించాడు. నిండు చందురుడు ఒకవైపు–చుక్కలు ఒకవైపు’ అని భావించే తత్వం ఆయనది. అందుకే అతను సోషల్‌ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. 

అయినా నిరుత్సాహపడలేదు. మరింత కసి, పట్టుదలతో ముందుకెళ్లాడు. ఎంచుక్ను రంగం ఏదైనా సరే, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే విజయం తనవెంటే ఉంటుందని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ అందులో తానే నటిస్తూ సోషల్‌ మీడియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అతనే మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె(గారబురుజు)కు చెందిన ప్రశాంత్‌. అతని విజయగాథపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..

👉సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటివారిలో ప్రశాంత్‌ ఒకరు. ప్రసూ బేబి అనే యూట్యూబ్‌ ఛానల్‌ పేరుతో తల్లిదండ్రుల నుంచి ప్రేమికుల వరకు వారి బాధ్యత గుర్తు చేస్తున్నాడు. సరదా సరదా వీడియోలతో యువతను ఆకట్టుకుంటున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనతో సత్తా చాటుతూ అనతికాలంలోనే సోషల్‌ మీడియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిష్‌గా కన్పించే ప్రశాంత్‌ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్‌ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్‌ అంటే ఎవరూ గుర్తు పట్టరు. కానీ ‘ప్రసూబేబి’ అంటే మాత్రం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఇట్టే గుర్తు పట్టేస్తారు.

అనంతపురం కేంద్రంగా...
ప్రశాంత్‌ ఎంటెక్‌ చదివేందుకు అనంతపురం జేఎన్‌టీయూలో చేరాడు. చదువుకుంటూనే సీరియస్‌ యాక్టింగ్‌ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్‌ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు 30 మందికిపైగా తనతో కలిసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్‌ చానళ్లు, ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్లు ఏర్పాటు చేయించి వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్‌ మీడియాలో ప్రశాంత్‌ పాపులారిటీ గుర్తించిన పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్‌ చేశారు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి.

వ్యవసాయ కుటుంబం నుంచి..
ప్రశాంత్‌ది వ్యవసాయ కుటుంబం. మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా, ప్రశాంత్‌ చిన్న కుమారుడు. ప్రాథమిక విద్య గ్రామంలో చదివాడు. ఇంటర్మీడియట్‌ వాల్మీకిపురం జూనియర్‌ కాలేజీలో, బీటెక్‌ మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో చదివాడు.

టిక్‌టాక్‌తో మొదలు పెట్టి..
మదనపల్లెలో ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతుండగానే నటనపై ఆసక్తితో 2019లో టిక్‌టాక్‌లో లిప్‌–సింక్‌ వీడియోలను చేయడం ప్రారంభించాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబ ఇతివృత్తంగా వీడియోలు రూపొందించాడు. అవి బాగా ట్రెండింగ్‌ కావడంతో లక్షల్లో సబ్‌ స్క్రైబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్‌పై మళ్లించాడు.

పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నంతోనే...
పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నంతోనే నేను ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోగలిగాను. సాధించాలన్న బలమైన కోరిక, దానినితోడు సరైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళితే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికి కనెక్ట్‌ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్‌ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధ చేసుకుంటున్నా. వెబ్‌ సీరిస్‌లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నా.
–ప్రశాంత్‌, ప్రసూబేబీ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement