ఆదుకోవాలని వేడుకుంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి హిమజ, తల్లి దేవి
‘చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా కాయకష్టం చేసి ఇంజినీరింగ్ దాకా నెట్టుకొచ్చారు. ఇప్పుడు మాయదారి రోగం నన్ను కుంగదీస్తోంది. ఉద్యోగం చేసి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఉంది. వారికి సేవ చేసి రుణం తీర్చుకోవాలని ఉంది. నన్ను బతికించండి. దాతలు ముందుకొచ్చి ప్రాణాలు కాపాడండి’ అంటూ ఆ చదువుల తల్లి కళ్లనిండా నీళ్లు పెట్టుకుని.. చేతులెత్తి నమస్కరిస్తూ దీనంగా అభ్యర్థిస్తుండడం కలచివేసింది. ఈ ఘటన మదనపల్లెలో శనివారం పలువురిని కదిలించింది.
చదవండి: ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా..
మదనపల్లె సిటీ: వైఎస్సార్ జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం, కోనపేటకు చెందిన రాయవరం చంద్రమోహన్, దేవి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి ఏకైక కుమార్తె ఆర్.హిమజ. కడపలోని కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం చంద్రమోహన్ కుటుంబసభ్యులతో కలిసి మదనపల్లె పట్టణ శివారు ప్రాంతమైన శ్రీవారినగర్‌కు వచ్చారు. స్థానిక నీరుగట్టువారిపల్లెలోని టమటా మార్కెట్ యార్డులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం హిమజ తీవ్ర అస్వస్థతకు గురైంది.
కుబుంబ సభ్యులు బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పుట్టకతోనే ఆమెకు ఓ కిడ్నీ లేదని, మరో కిడ్నీ పాడైందని అక్కడి వైద్యులు తేల్చారు. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని, అప్పటి వరకు డయాలసిస్ చేయిస్తుండాలని సూచించారు. కిడ్నీ మార్పిడి చేయాలంటే రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. రెండు నెలల నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ఇప్పటికే బిడ్డ ఆరోగ్యం కోసం రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ – 9502058163, ఎస్బీఐ, మదనపల్లె బ్రాంచ్, అకౌంట్ నం.35877578698, ఐఎఫ్‌ఐసీ కోడ్ : ఎస్బీఐఎన్ 0003748.
Comments
Please login to add a commentAdd a comment