‘జునూద్‌’ కేసులో మరో అరెస్టు | Abid Khan Arrested in Junud ul Khalifa e Hind | Sakshi
Sakshi News home page

‘జునూద్‌’ కేసులో మరో అరెస్టు

Published Mon, Dec 19 2016 3:16 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

‘జునూద్‌’ కేసులో మరో అరెస్టు - Sakshi

‘జునూద్‌’ కేసులో మరో అరెస్టు

హిమాచల్‌లోని కులులో పట్టుబడిన అబిద్‌ ఖాన్‌
టోలిచౌకిలో జరిగిన కీలక సమావేశానికీ హాజరు  


సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్ని సిటీలో చిక్కిన ఐసిస్‌ అనుబంధ సంస్థ జునూద్ అల్‌ ఖలీఫా ఫిల్‌ హింద్‌ (జేకేహెచ్‌) ఉగ్రవాద మాడ్యూల్‌కు చెందిన మరో ముష్కరుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. దాదాపు ఆరు నెలలుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు సమీపంలోని ఓ చర్చిలో తలదాచుకున్న అబిద్‌ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఇతగాడు హైదరాబాద్‌లో చిక్కిన అబు అన్స్‌కు అనుచరుడిగా ఉండటంతో పాటు టోలిచౌకిలో జరిగిన కీలక సమావేశంలోనూ పాల్గొన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఎన్‌ఐఏ అధికారులకు దేశవ్యాప్తంగా 14 మందితో పాటు నగరంలోనూ నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసించిన అబు అన్స్, టోలిచౌకి వాసి మహ్మద్‌ షరీఫ్‌ మొయినుద్దీన్‌ ఖాన్‌ సైతం ఉన్నారు. బెంగళూరుకు చెందిన అబిద్‌ ఖాన్‌ ఆన్‌లైన్‌ ద్వారానే ఆకర్షితుడై జేకేహెచ్‌ మాడ్యూల్‌లో చేరాడు. ఈ మాడ్యూల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముంబై వాసి ముదబ్బీర్‌తో పాటు అబు అన్స్‌తో సన్నిహితంగా మెలిగాడు.

సిటీలోనే 2 ‘ఉగ్ర’ సమావేశాలు
దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్‌ బాంబుల తయారీతో పాటు ముష్కరులకు శిక్షణ ఇవ్వాలని భావించింది. దీనికోసం ఉగ్రవాదులు 2015 జనవరి–డిసెంబర్‌ మధ్య కర్ణాటకలోని టుమ్కూర్, బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, మహారాష్ట్రలోని ముంబైతో పాటు హైదరాబాద్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో నగరంలో జరిగిన రెండు సమావేశాలకు బెంగళూరు నుంచి అబిద్‌ ఖాన్‌ వచ్చి వెళ్లాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. టోలిచౌకిలోని నిజాం కాలనీలో ఉన్న మహ్మద్‌ షరీఫ్‌ మొయినుద్దీన్‌ ఖాన్‌ ఇంట్లో 2015 జనవరి 15న, డిసెంబర్‌ 14న ఈ ఉగ్రవాదుల సమావేశాలకు అబిద్‌ ఖాన్‌ హాజరయినట్లు తేలింది. అబిద్‌ ఖాన్‌ జేకేహెచ్‌ మాడ్యూల్‌లో అబు మహ్మద్‌ పేరుతో చెలామణీ అయ్యాడు.

వికారాబాద్‌తో సహా మూడుచోట్ల ‘పర్యటన’
జేకేహెచ్‌ ఉగ్రవాదులు నఫీజ్‌ ఖాన్, అబు అన్స్‌ గెరిల్లా యుద్ధ తంత్రాల శిక్షణతో పాటు పేలుడు పదార్థాలు, తుపాకుల్ని ప్రయోగించడం కోసం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని కొన్ని ప్రదేశాలకు వెళ్లి అనువైన వాటిని, ఓ ఫామ్‌హౌస్‌ను గుర్తించారు. ఈ ప్రక్రియలో నగరానికి చెందిన నలుగురు ఉగ్రవాదులతో పాటు అబిద్‌ ఖాన్‌ సైతం పాల్గొన్నాడు. జేకేహెచ్‌ మాడ్యూల్‌ అరెస్టు కావడంతో అబిద్‌ ఖాన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆర్నెల్ల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌ లో కులు సమీపంలో ఉన్న బంజార్‌కు చేరుకుని అక్కడే ఉంటున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement