ఏబీవీపీ బంద్ విజయవంతం
నెల్లూరు(టౌన్) : డిగ్రీ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతం అయిందని ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీష్ తెలిపారు. డీకేడబ్ల్యూ విద్యార్థినులతో స్థానిక కేవీఆర్ పెట్రోలు బంకు సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు లేని కళాశాలలపై దాడులు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జీఓనెం 35ను రద్దు చేసి ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో మౌళిక వసతులు కల్పించి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. వీఎస్‌యూకు యూజీసీ 12బి గుర్తింపును ఇవ్వాలన్నారు. వర్సిటీ అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయుకులు శ్రీకాంత్, నరేష్, బాలచంద్ర, రాజేష్, పరుశురామ్, భాస్కర్, మహేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.