మంత్రులు రాజీనామా చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటి: ఎంసెట్ పేపర్2ను ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఏబీవీపీ రాష్ట్ర కమిటగీ పిలుపు మేరకు పట్టణంలోని విద్యాసంస్థల్లో తరగతుల బహిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ వంటి కీలక ప్రవేశ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రశ్నపత్రం లీకేజీ అయ్యిందని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకేజీ వెనక ప్రభుత్వ హస్తం ఉందని విమర్శించారు.
ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రితోపాటు వైద్యశాఖ మంత్రిలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులను పట్టుకొని ప్రభుత్వం ర్యాంకులు సాధించిన వారిని ద్రోహులుగా చిత్రీకరించి పోలీసు వాహనాల్లో తరలించడం ఎంత వరకు సమంజసమన్నారు.
ఇప్పటికే విద్యార్థులు ఉద్యోగాలకోసం పలు అర్హత పరీక్షలు రాసి మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఎంసెట్ పరీక్షను రద్దుచేయడం విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు నెహ్రూ రాథోడ్, జోనల్ ఇన్‌చార్జిచార్జ్ అశోక్, నాయకులు విఠల్, శ్రీకాంత్, అభిలాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో..
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ అయిందని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదుట ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన నిందులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు.
ఎంసెట్ పరీక్షను రద్దుచేయకుండా అందుకు బాధ్యులైన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఎంసెట్‌పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.