తొండంగి తహసీల్దార్‌పై ఏసీబీ విచారణ
తొండంగి తహసీల్దార్‌పై ఏసీబీ విచారణ
Published Sun, Jul 2 2017 12:03 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
తొండంగి (తుని) : తాము కొనుగోలు చేసిన జిరాయితీ భూమికి సంబంధించి ఆన్‌లైన్ అండగళ్‌లో వివరాలు నమోదు చేసేందుకు తహసీల్దార్ సొమ్ములు డిమాండ్ చేశారని బాధితుడు ఫిర్యాదుపై శనివారం రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేశారు. బాధితుడు, రిటైర్డ్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి సంకు వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి...
కోన ఫారెస్టు పరిధిలో తన భార్య సంకు గిరిజ పేరున సర్వే నెంబర్ 47/18, 47/19లలో 2.05 ఎకరాల భూమిని 2006లో కొనుగోలు చేసి తుని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించిన వివరాలు జిరాయితీ భూమిగా ఆన్‌లైన్‌లోని 1బీ ఫారంలో కూడా నమోదైంది. అంతేకాకుండా అప్పటి రెవెన్యూ అధికారులు గిరిజ యజమానిగా పేర్కొంటూ పట్టాదారు పాసుపుస్తకం, భూ యాజమాన్యం హక్కుపత్రాలను మంజూరు చేశారు. అయితే ఆన్‌లైన్ అడంగళ్ వివరాలలో సంకు గిరిజ నమోదైనట్టు రాకపోవడంతో ఆన్‌లైన్ చేయాలని 2016లో దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం పలు దఫాలుగా తిరిగినప్పటికీ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణ, కంప్యూటర్ సిబ్బంది కూడా పట్టించుకోలేదని, ఆన్‌లైన్ అడంగళ్ నమోదు చేసేందుకు తహసీల్దార్ రూ.రెండు లక్షలు సొమ్ము డిమాండ్ చేశారంటూ 2016 ఆగస్టులో ముఖ్యమంత్రికి, ఏసీబీ డీజీపీకి, ఇతర అధికారులకు భార్య సంకు గిరిజ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈనేపథ్యంలో రాజమండ్రి ఏసీబీ సీఐ పి.వి.సూర్యమోహన్ తహసీల్దార్ టి.వి.సూర్యనారాయణను విచారణ చేశారు. ఈవిచారణకు సంకు వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. అయితే కోనఫారెస్టు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో అసైన్డ్ భూమిగా ఉందని, ఈవిధంగా చాలా మంది భూముల పెండింగ్‌లో ఉన్నాయంటూ తహసీల్దార్ సూర్యనారాయణ ఏసీబీ అధికారి సూర్యమోహన్‌కు వివరణ ఇచ్చారు. 1975 తర్వాత కోనఫారెస్టు అసైన్డ్ భూములను రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చిందన్నారు. ఈ భూములనే ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ) సేకరించిందన్నారు. ఆన్‌లైన్ అడంగళ్ చేసేందుకు తాను ఎటువంటి సొమ్ములు డిమాండ్ చేయలేదని, వాస్తవంగా ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో ఉన్న విషయాన్నే తెలిపానన్నారు. కలెక్టర్, ఆర్డీవో, డీఆర్వో అధికారులతో చర్చించి ఆన్‌లైన్ ప్రక్రియపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ పూర్తయిన అనంతరం సూర్యమోహన్ మాట్లాడుతూ తహసీల్దార్‌పై వచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టామన్నారు. విచారణ పూర్తిస్థాయిలో జరిగిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో కూడా భూమి రికార్డుల ప్రకారం సంబం«ధిత భూమి అమ్మిన రైతులను కూడా విచారణ చేస్తామని వివరించారు. కాగా ఇలాంటి సంఘటనపై గతంలో కూడా ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టినట్టు సమాచారం. వరుస ఏసీబీ అధికారుల విచారణలతో రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది.
Advertisement
Advertisement