ఏసీబీ సోదాలు
ఏసీబీ సోదాలు
Published Fri, Jul 22 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఏలూరు అర్బన్ : ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడి చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా ఈ కార్యాలయంలో అవినీతి జరుగుతోందనే సమాచారంతో వలపన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించారు. రికార్డులు పరిశీలించారు. సబ్‌రిజిస్ట్రార్ టేబుల్‌పైనా, కొందరు దస్తావేజు లేఖరులు, ఇతరుల వద్ద అనధికారికంగా ఉన్న 3,55,915 రూపాయలను, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలు చేస్తుండగా.. అప్పటివరకూ అక్కడే విధుల్లో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కె.విజయమణి ఉడాయించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన దళారులు, కొందరు లేఖరులు కూడా చల్లగా జారుకున్నారు.
ముందే ఉప్పందిందా..!
ఏసీబీ దాడుల గురించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి ముందే ఉప్పందినట్టు విమర్శలు వినవస్తున్నాయి. అందుకే సిబ్బంది దొరక్కుండా అప్రమత్తమయ్యారని సమాచారం.
సబ్‌రిజిస్ట్రార్ ఉడాయింపుపై చర్చ .. ఏసీబీ సోదాలు జరుగుతుండగానే సబ్‌రిజిస్ట్రార్ ఉడాయించడాన్ని ఏసీబీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై కార్యాలయంలో చర్చ జరిగింది. అయితే ఆమె ముందే రెండు రోజులు సెలవు పెట్టారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీనిలో నిజమెంతనేది విచారణ తర్వాత తెలుస్తుంది.
ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర ఏమన్నారంటే.. ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని చాలాకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర చెప్పారు. ఈ నేపథ్యంలోనే దాడిచేశామని పేర్కొన్నారు. తొలుత కార్యాలయ ఉద్యోగులను ప్రశ్నిస్తున్న సమయంలో అప్పటి వరకూ విధుల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కె.విజయమణి తమ కళ్లుగప్పి పారిపోయారని వివరించారు. దీంతో ఆమె టేబుల్ మీద అనధికారికంగా ఉన్న రూ. లక్ష స్వాధీనం చేసుకున్నామని, అదే క్రమంలో కార్యాలయంలో ఉన్న లేఖరులు వైట్ అండ్ వైట్ నాయుడు, ఉమా వద్ద, కార్యాలయ తోటమాలితోపాటు మరికొందరి నుంచి రూ.3,55,915లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ ఆరా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడి జరుగుతోందని సమాచారం అందుకున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ లక్ష్మీనారాయణ రెడ్డి హుటాహుటిన రిజిషే్ట్రషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సబ్ రిజిస్ట్రార్ విజయమణి ఏసీబీ అధికారుల కళ్లుగప్పి పారిపోయారనే ఆరోపణపై మాట్లాడుతూ.. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేయకుండా.. ఆమె అసలు కార్యాలయానికి వచ్చారా లేదా అనేది ధ్రువీకరించలేమన్నారు. అవినీతి జరిగిందని స్పష్టమైతే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐ యు. జోసఫ్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement