rs.3
-
ఆన్లైన్ ముంచింది.. రూ.3,700 కోట్ల మోసం
లక్నో: సోషల్ ట్రేడ్ మోసం బట్టబయలైంది. రూ.3,700 కోట్ల ఘరానా మోసం బయటపడింది. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పలువురు అమాయకులకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపుగా ఒక్కొక్కరి నుంచి రూ.57,500 వసూలు చేశారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దీని భారిన పడిన బాధితులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన వారు కూడా చాలామంది ఉన్నట్లు దీనివల్ల బలైనవారిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఈ బిజినెస్ వ్యవహారం సాగినట్లు పోలీసులు చెప్పారు. ఇంతకీ ఏంటీ సోషల్ ట్రేడ్.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్ 63లో అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది సోషల్ ట్రేడ్. బిజ్ అంటూ ఒక సైట్ ను పెట్టి అందులోకి ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట పలువురిని ఆకర్షించింది. తొలుత కొంతమొత్తం కట్టి ఆ సైట్ ఇచ్చే లింక్‌లను క్లిక్ చేస్తుండాలి. అలా చేయడం ద్వారా ఒక్కో క్లిక్కు రూ.5వరకు ఇస్తారు. దాంతోపాటు వారు మరొకరిని అందులో చేర్పిస్తే వారికి అదనంగా మరో క్లిక్ వచ్చి అదనపు సొమ్ము వస్తుంది. ఆ కంపెనీ చేసిన ఈ మాయలో పలువురు ఇరుక్కున్నారు. ఒక్కొక్కరు దాదాపు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడులు పెట్టారు. అనంతరం కంపెనీ బోర్డు తిరగలేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు కంపెనీని గుర్తించి ఓ ముగ్గురుని అరెస్టు చేశారు. వారిని జోరుగా విచారిస్తున్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఈ సంస్థ తరుచుగా సైట్ పేరు మార్చుకుంటుండటం విశేషం. -
ఆన్లైన్లో మోసం
నవాబుపేట : ఆన్లైన్లో లాటరీ తగిలిందంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి నమ్మబలకడంతో ఓ బాధితుడు మోసపోయాడు. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేట మండలం ఇప్పటూర్‌కు చెందిన శివకు వారం రోజుల క్రితం ఆన్లైన్లో ‘మీకు ధనలక్ష్మి యంత్రం లాటరీ తగిలింది. మీరు చేయాల్సిందల్లా మా పేరుతో రూ.3,500లకు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పంపించండి.. మీకు రెండు తులాల బంగారంతో చేసిన ధనలక్ష్మి యంత్రం, స్వామివారి పాదుకలు, వాహనం లభిస్తాయి..’ అంటూ ఎక్కడి నుంచో కాల్ వచ్చింది. వారు ఫోన్లో చెప్పిన చిరునామాకు డీడీ తీసి పంపగా కేవలం ఇత్తడి పూతతో చేసిన యంత్రం, పాదుకలు వచ్చాయి. అలాగే ఒక స్మార్ట్ ఫోన్ సైతం లాటరీలో వచ్చిందని చెప్పిన వారు దానిని పంపకుండా మోసం చేశారు. కాగా ఈ విషమై అక్కడి నంబరుకు కాల్ చేస్తే సరిగా సమాధానం రాలేదు. దీంతో చివరకు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్ : ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడి చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా ఈ కార్యాలయంలో అవినీతి జరుగుతోందనే సమాచారంతో వలపన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఉదయం ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించారు. రికార్డులు పరిశీలించారు. సబ్‌రిజిస్ట్రార్ టేబుల్‌పైనా, కొందరు దస్తావేజు లేఖరులు, ఇతరుల వద్ద అనధికారికంగా ఉన్న 3,55,915 రూపాయలను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలు చేస్తుండగా.. అప్పటివరకూ అక్కడే విధుల్లో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కె.విజయమణి ఉడాయించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన దళారులు, కొందరు లేఖరులు కూడా చల్లగా జారుకున్నారు. ముందే ఉప్పందిందా..! ఏసీబీ దాడుల గురించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి ముందే ఉప్పందినట్టు విమర్శలు వినవస్తున్నాయి. అందుకే సిబ్బంది దొరక్కుండా అప్రమత్తమయ్యారని సమాచారం. సబ్‌రిజిస్ట్రార్ ఉడాయింపుపై చర్చ .. ఏసీబీ సోదాలు జరుగుతుండగానే సబ్‌రిజిస్ట్రార్ ఉడాయించడాన్ని ఏసీబీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై కార్యాలయంలో చర్చ జరిగింది. అయితే ఆమె ముందే రెండు రోజులు సెలవు పెట్టారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీనిలో నిజమెంతనేది విచారణ తర్వాత తెలుస్తుంది. ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర ఏమన్నారంటే.. ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని చాలాకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర చెప్పారు. ఈ నేపథ్యంలోనే దాడిచేశామని పేర్కొన్నారు. తొలుత కార్యాలయ ఉద్యోగులను ప్రశ్నిస్తున్న సమయంలో అప్పటి వరకూ విధుల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కె.విజయమణి తమ కళ్లుగప్పి పారిపోయారని వివరించారు. దీంతో ఆమె టేబుల్ మీద అనధికారికంగా ఉన్న రూ. లక్ష స్వాధీనం చేసుకున్నామని, అదే క్రమంలో కార్యాలయంలో ఉన్న లేఖరులు వైట్ అండ్ వైట్ నాయుడు, ఉమా వద్ద, కార్యాలయ తోటమాలితోపాటు మరికొందరి నుంచి రూ.3,55,915లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ ఆరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడి జరుగుతోందని సమాచారం అందుకున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ లక్ష్మీనారాయణ రెడ్డి హుటాహుటిన రిజిషే్ట్రషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సబ్ రిజిస్ట్రార్ విజయమణి ఏసీబీ అధికారుల కళ్లుగప్పి పారిపోయారనే ఆరోపణపై మాట్లాడుతూ.. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేయకుండా.. ఆమె అసలు కార్యాలయానికి వచ్చారా లేదా అనేది ధ్రువీకరించలేమన్నారు. అవినీతి జరిగిందని స్పష్టమైతే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐ యు. జోసఫ్ విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.3 వేల కోట్లు ఇవ్వండి
- కరువుపై కేంద్రానికి మరో నివేదిక పంపిన రాష్ట్ర సర్కారు - కేంద్ర బృందం సూచనలకు అనుగుణంగా సవరణలు - గత నివేదికలో కన్నా మరో రూ.500 కోట్ల పెంపు - మత్స్య, ఉద్యాన రంగాల నష్టం రూ.289 కోట్లుగా నిర్ధారణ - గ్రామీణ నీటి సరఫరా అంచనాల్లో భారీ పెంపు - కరువు ప్రాంతాల్లో బతుకుదెరువు పింఛన్లకు రూ.700 కోట్లు సాక్షి, హైదరాబాద్: కరువు నష్టంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, అంతమేర సాయం అందించాలని తాజా నివేదికలో విన్నవించింది. తొలి అంచనాతో పోలిస్తే రూ.500 కోట్లకు పైగా నష్టాన్ని పెంచుతూ సవరణలు చేసింది. రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం శుక్రవారం ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తొలి నివేదికలో విస్మరించిన ఉద్యానవన పంటలు, చేపల పెంపకం విభాగాలను ఇందులో ప్రస్తావించింది. కరువు మండలాల్లో గ్రామీణ నీటి సరఫరాకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులను సైతం అదనంగా జత చేసింది. దీంతో కరువు నష్టం అంచనాలు పెరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మత్స్య, ఉద్యానంలో భారీ నష్టం.. వర్షాభావంతో రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలు, చెరువులు, కుంటలు అడుగంటాయి. దీంతో చేపల పెంపకానికి అపార నష్టం వాటిల్లింది. ప్రతి మండలంలోనూ దాదాపు నాలుగైదు చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం సాగుతోంది. అవన్నీ ఎండిపోవటంతో మత్స్యకారులు భారీగా నష్టపోయారు. దాదాపు రూ.280 కోట్లకు పైగా ఈ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తాజా నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల ఎకరాల్లో బత్తాయి, మామిడి, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం రూ.9 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. తొలి నివేదికలో ఉద్యానవన శాఖ, మత్స్య శాఖల వివరాలను ప్రభుత్వం పొందుపరచలేదు. క్షేత్ర పరిశీలనకు వెళ్లిన కేంద్ర బృందం ఈ రెండు విభాగాల్లోనూ అపార నష్టం వాటిల్లినట్లుగా గుర్తించింది. దీంతో వెంటనే సంబంధిత శాఖల నుంచి తెప్పించిన ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచింది. కేంద్ర బృందం సూచనల మేరకే.. కరువు మండలాల్లోని రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ.2,514 కోట్ల సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలి నివేదికలో విజ్ఞప్తి చేసింది. తర్వాత రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండ్రోజులపాటు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. ఇదే సందర్భంగా ప్రభుత్వం పంపించిన నివేదికలు అసమగ్రంగా ఉన్నాయని, కరువు నిబంధనలకు అనుగుణంగా నష్టాలను సవరించి మరోసారి సమగ్ర నివేదికను పంపించాలని సూచించింది. అప్రమత్తమైన ప్రభుత్వం తొలుత పంపించిన నివేదికలో మార్పుచేర్పులతో కొత్త నివేదికను రూపొందించింది. కేంద్ర బృందం వేలెత్తి చూపిన అంశాలనే ప్రధానంగా సవరించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. తాగునీటి అంచనాలకు కత్తెర తొలి నివేదికలో వ్యవసాయ శాఖకు రూ.863 కోట్లు, గ్రామీణ మంచినీటి సరఫరాకు రూ.102 కోట్లు, పట్టణ మంచినీటి సరఫరాకు రూ.86 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.134 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.42 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.369 కోట్లు, ఫించన్లకు రూ.917 కోట్లు మంజూరు చేయాలని కోరింది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం నమోదైందని, కరువు మండలాల్లో సిటీ లేనందున మెట్రో వాటర్ వర్క్స్‌కు ప్రతిపాదించిన అంచనాలను తొలగించాలని కేంద్ర బృందం సూచించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే జలాశయాలు నగర పరిధిలో లేవని, కరువు బారిన పడి అడుగంటాయని రాష్ట్ర అధికారులు చెప్పిన సమాధానానికి కేంద్ర బృందం సంతృప్తి చెందలేదు. దీంతో ఈ అంచనాలను రూ.134 కోట్ల నుంచి రూ.90 కోట్లకు సవరించారు. పట్టణ నీటి సరఫరాకు అడిగిన రూ.86 కోట్లను సైతం కొంత మేరకు కుదించారు. అదే సమయంలో ఏప్రిల్ నుంచి గ్రామీణ నీటి సరఫరాకు ఖర్చు చేసిన నిధులను కరువు నష్టంలో చూపించాలని కేంద్ర బృందం సూచించటంతో.. ఈ అంచనా దాదాపు రూ.400 కోట్లకు పైగా పెరిగిపోయింది. కరువు మండలాల్లో పని దొరకని కూలీలు, వృద్ధులకు బతుకు దెరువు ఫించన్లు (గ్రాట్యుటరీ రిలీఫ్) ఇచ్చేందుకు రూ.917 కోట్లు కావాలని ప్రభుత్వం కోరింది. కేటగిరీల వారీగా ఎవరికెంత సాయం అందించాలో తెలియజేయాలన్న కేంద్ర బృందం మార్గదర్శకాల ప్రకారం ఈ సాయం రూ.700 కోట్లకు కుదించింది. అదనపు ‘ఉపాధి’కి రూ. 580 కోట్లు ఇవ్వండి - కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఉపాధి హామీ పథకం కింద కరువు మండలాల్లో అదనపు ఉపాధి నిమిత్తం 580 కోట్లు అవసరమవుతాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 231 కరువు మండలాల్లో ఉపాధి హామీ పథ కం కింద 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ అదనంగా మరో 50 రోజులపాటు పని కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా అదనపు పని దినాలను మరో 50 రోజులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాజాగా గ్రామీణాభివృద్ధి విభాగం రూపొందించిన అంచనాలతో ఉన్నతాధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. కాగా కేవలం కరువు మండలాల్లోనే కాకుండా, ఇతర మండలాల్లోనూ అర్హులైన పేద కుటుంబాలకు అదనపు ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు కోరుతున్నారు. -
విశాఖ-కౌలాలంపూర్ 3,399కే టికెట్
ఎయిర్ఏషియా ఆఫర్ న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల కోసం మలేషియాకు చెందిన ఎయిర్ఏషియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తగ్గింపు ధరల్లో 30 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు ఎయిర్ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,399గా, కొచ్చి-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,699గా ఉంటుందని పేర్కొంది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్ వారం రోజులు ఉంటుందని, ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వ చ్చే ఏడాది మే 31 వరకు ఎప్పుడైన ప్రయాణించవచ్చని తెలిపింది. కోల్‌కతా-కౌలాలంపూర్, బెంగుళూరు-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.6,999గా, తిరుచ్చి-హైదరాబాద్ టికెట్ ధర రూ.4,699గా ఉంటుందని పేర్కొంది. అలాగే బెంగుళూరు-కొచ్చి, బెంగుళూరు-గోవా, బెంగుళూరు-జైపూర్, బెంగుళూరు-చండీగఢ్ వంటి దేశీ విమాన టికెట్ ధరలు వరుసగా రూ.1,390,రూ.1,690, రూ.3,290, రూ.3,490గా ఉంటాయని ఎయిర్ఏషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు చాండిల ్య తెలిపారు.