రూ.3 వేల కోట్లు ఇవ్వండి | Telangana urges Centre to release Rs.3,000 crores to overcome drought | Sakshi
Sakshi News home page

రూ.3 వేల కోట్లు ఇవ్వండి

Published Sat, Dec 12 2015 4:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

రూ.3 వేల కోట్లు ఇవ్వండి

రూ.3 వేల కోట్లు ఇవ్వండి

- కరువుపై కేంద్రానికి మరో నివేదిక పంపిన రాష్ట్ర సర్కారు
- కేంద్ర బృందం సూచనలకు అనుగుణంగా సవరణలు
- గత నివేదికలో కన్నా మరో రూ.500 కోట్ల పెంపు
- మత్స్య, ఉద్యాన రంగాల నష్టం రూ.289 కోట్లుగా నిర్ధారణ
- గ్రామీణ నీటి సరఫరా అంచనాల్లో భారీ పెంపు
- కరువు ప్రాంతాల్లో బతుకుదెరువు పింఛన్లకు రూ.700 కోట్లు

సాక్షి, హైదరాబాద్:
కరువు నష్టంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, అంతమేర సాయం అందించాలని తాజా నివేదికలో విన్నవించింది. తొలి అంచనాతో పోలిస్తే రూ.500 కోట్లకు పైగా నష్టాన్ని పెంచుతూ సవరణలు చేసింది. రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం శుక్రవారం ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తొలి నివేదికలో విస్మరించిన ఉద్యానవన పంటలు, చేపల పెంపకం విభాగాలను ఇందులో ప్రస్తావించింది. కరువు మండలాల్లో గ్రామీణ నీటి సరఫరాకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులను సైతం అదనంగా జత చేసింది. దీంతో కరువు నష్టం అంచనాలు పెరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

మత్స్య, ఉద్యానంలో భారీ నష్టం..
వర్షాభావంతో రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలు, చెరువులు, కుంటలు అడుగంటాయి. దీంతో చేపల పెంపకానికి అపార నష్టం వాటిల్లింది. ప్రతి మండలంలోనూ దాదాపు నాలుగైదు చెరువులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం సాగుతోంది. అవన్నీ ఎండిపోవటంతో మత్స్యకారులు భారీగా నష్టపోయారు. దాదాపు రూ.280 కోట్లకు పైగా ఈ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తాజా నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల ఎకరాల్లో బత్తాయి, మామిడి, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం రూ.9 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. తొలి నివేదికలో ఉద్యానవన శాఖ, మత్స్య శాఖల వివరాలను ప్రభుత్వం పొందుపరచలేదు. క్షేత్ర పరిశీలనకు వెళ్లిన కేంద్ర బృందం ఈ రెండు విభాగాల్లోనూ అపార నష్టం వాటిల్లినట్లుగా గుర్తించింది. దీంతో వెంటనే సంబంధిత శాఖల నుంచి తెప్పించిన ప్రతిపాదనలను ఇందులో పొందుపరిచింది.

కేంద్ర బృందం సూచనల మేరకే..
కరువు మండలాల్లోని రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ.2,514 కోట్ల సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలి నివేదికలో విజ్ఞప్తి చేసింది. తర్వాత రాష్ట్రానికి  వచ్చిన కేంద్ర బృందం రెండ్రోజులపాటు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. ఇదే సందర్భంగా ప్రభుత్వం పంపించిన నివేదికలు అసమగ్రంగా ఉన్నాయని, కరువు నిబంధనలకు అనుగుణంగా నష్టాలను సవరించి మరోసారి సమగ్ర నివేదికను పంపించాలని సూచించింది. అప్రమత్తమైన ప్రభుత్వం తొలుత పంపించిన నివేదికలో మార్పుచేర్పులతో కొత్త నివేదికను రూపొందించింది. కేంద్ర బృందం వేలెత్తి చూపిన అంశాలనే ప్రధానంగా సవరించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.

తాగునీటి అంచనాలకు కత్తెర
తొలి నివేదికలో వ్యవసాయ శాఖకు రూ.863 కోట్లు, గ్రామీణ మంచినీటి సరఫరాకు రూ.102 కోట్లు, పట్టణ మంచినీటి సరఫరాకు రూ.86 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.134 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.42 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.369 కోట్లు, ఫించన్లకు రూ.917 కోట్లు మంజూరు చేయాలని కోరింది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం నమోదైందని, కరువు మండలాల్లో సిటీ లేనందున మెట్రో వాటర్ వర్క్స్‌కు ప్రతిపాదించిన అంచనాలను తొలగించాలని కేంద్ర బృందం సూచించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేసే జలాశయాలు నగర పరిధిలో లేవని, కరువు బారిన పడి అడుగంటాయని రాష్ట్ర అధికారులు చెప్పిన సమాధానానికి కేంద్ర బృందం సంతృప్తి చెందలేదు.

దీంతో ఈ అంచనాలను రూ.134 కోట్ల నుంచి రూ.90 కోట్లకు సవరించారు. పట్టణ నీటి సరఫరాకు అడిగిన రూ.86 కోట్లను సైతం కొంత మేరకు కుదించారు. అదే సమయంలో ఏప్రిల్ నుంచి గ్రామీణ నీటి సరఫరాకు ఖర్చు చేసిన నిధులను కరువు నష్టంలో చూపించాలని కేంద్ర బృందం సూచించటంతో.. ఈ అంచనా దాదాపు రూ.400 కోట్లకు పైగా పెరిగిపోయింది. కరువు మండలాల్లో పని దొరకని కూలీలు, వృద్ధులకు బతుకు దెరువు ఫించన్లు (గ్రాట్యుటరీ రిలీఫ్) ఇచ్చేందుకు రూ.917 కోట్లు కావాలని ప్రభుత్వం కోరింది. కేటగిరీల వారీగా ఎవరికెంత సాయం అందించాలో తెలియజేయాలన్న కేంద్ర బృందం మార్గదర్శకాల ప్రకారం ఈ సాయం రూ.700 కోట్లకు కుదించింది.
 
అదనపు ‘ఉపాధి’కి రూ. 580 కోట్లు ఇవ్వండి
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

ఉపాధి హామీ పథకం కింద కరువు మండలాల్లో అదనపు ఉపాధి నిమిత్తం     580 కోట్లు అవసరమవుతాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 231 కరువు మండలాల్లో ఉపాధి హామీ పథ కం కింద 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ అదనంగా మరో 50 రోజులపాటు పని కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా అదనపు పని దినాలను మరో 50 రోజులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాజాగా గ్రామీణాభివృద్ధి విభాగం రూపొందించిన అంచనాలతో ఉన్నతాధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. కాగా కేవలం కరువు మండలాల్లోనే కాకుండా, ఇతర మండలాల్లోనూ అర్హులైన  పేద కుటుంబాలకు అదనపు ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement