సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘పొగాకు నియంత్రణ చర్యలు’అంత సంతృప్తిగా లేవని కేంద్రం స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణ, బహిరంగ ప్రదే శాల్లో పొగతాగడం నిషేధంపై 2003లో ‘కోట్తా’చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2020 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల చట్టం ఎలా అమలవుతుందనే దానిపై, ఇంకెలా చేయొచ్చన్న దానిపై పొగాకు వినియోగం, దాని నియంత్రణపై ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది.
దాని ఆధారంగా ఓ నివేదిక రూపొందించింది. అమలుపై పాండిచ్చేరిలోని జిప్‌మర్, చండీగఢ్‌కు చెందిన పీజీఐఎంఈఆర్‌లు పరిశోధన చేశా యి. 2020 నవంబర్‌లో ఒకసారి, అక్టోబర్ 2021 తర్వాత ఒకసారి తెలంగాణ, పాండిచ్ఛేరి, మేఘాలయలో ఈ అధ్యయనం చేశారు. ఒక్కో రాష్ట్రంలో 9 జిల్లాల్లో పరిశీలించారు. అనంతరం వాటి ఫలితాలను ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజీఎంఆర్‌లో తాజాగా ప్రచురించారు. తెలంగాణలో 2020లో మొదటి విడతలో 2,029 మందిని సర్వే చేశారు.
రెండో విడత 2021లో 1,097 మందిపై చేశారు. ‘పొగాకు నియంత్రణ చర్యలు తెలంగాణలో పెరిగాయి. అయితే కొన్నింటిలో మాత్రం తగ్గుదల ఉన్నట్టు నివేదిక చెబుతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి ప్రకటనల నిలుపుదలపై పురోగతి ఉందని’డాక్టర్ కిరణ్ మాదల (సైంటిఫిక్ కమిటీ కన్వినర్, ఐఎంఏ) అభిప్రాయపడ్డారు.
పొగాకు బాక్సులపై స్థానిక భాషలో హెచ్చరికలు ఏవీ?
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగ నియంత్రణ చర్యల్లో మాత్రమే తెలంగాణలో పురోగతి ఉంది. ఉత్పత్తిదారులను నియంత్రించడంలోనూ...హెచ్చరికల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలిపింది.
♦ పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌పై వార్నింగ్ సింబల్ విషయంలో మొదటి దశలో 75 శాతంగా ఉండగా, రెండో దశలో అది 83 శాతానికి పెరిగింది.
♦ పొగాకు ఉత్పత్తుల బాక్స్‌పై వార్నింగ్ సింబల్ 85 శాతం కవరయ్యేలా ఉండాలి. ఆ విషయంలో మొదటి విడతలో 75 శాతం ఉండగా, రెండో విడతలో 91 శాతంగా ఉంది.
♦ స్థానిక భాషలో ముద్రించే విషయంలో మొదటి విడత 45 శాతం ఉంటే, రెండో విడత 13 శాతానికి దిగజారింది.
♦ 18 ఏళ్లలోపు వారికి పొగాకు వాడకం, అమ్మకాలపై నిషేధం ఉండాలి. నిషేధం తీరు మొదటి విడతలో 95 శాతం ఉండగా, రెండో విడతలో 99 శాతం పెరిగింది.
♦ 18 ఏళ్లలోపు పిల్లలు పొగాకు ఉత్పత్తులను ఇతరులకు అమ్మటాన్ని నిరోధించడంలో తెలంగాణలో మొదటి విడతలో 97 శాతం ఉండగా, రెండో విడతలో అది ఏకంగా 100 శాతానికి చేరింది.
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకం తగ్గింది
తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అధ్యయనంలో మొదటి విడత 86.9 శాతం ఉండగా, రెండోసారి 98.5 శాతానికి పెరిగింది. ఆ మేరకు మార్పు కనిపించింది.
♦ బహిరంగ ప్రదేశాల్లో తాగొద్దన్న బోర్డులు పెట్టారు. మొదటి దశలో 45.2 శాతంగా ఉంటే, రెండో విడతలో 54.1 శాతానికి పెరిగింది. అయితే నిబంధనల ప్రకారం బోర్డులు పెట్టలేదని తేలింది.
♦ నిబంధనల ప్రకారం బోర్డులను ఏమేరకు పెట్టారో చూస్తే... మొదటి దశలో రెండు శాతం, రెండో దశలో 15 శాతానికి పెరిగింది.
♦ పొగాకు తాగొద్దని పెట్టే బోర్డుపై సంబంధిత అధికారి ఫోన్ నంబర్ పొందుపరచడం అనేది మొదటి దశలో 1.6 శాతం ఉంటే, రెండో దశలో 1.5 శాతానికి తగ్గింది. పొగాకు తాగకుండా ఉండే పరిస్థితులు కల్పించడంలో మొదటి దశలో 86.9 శాతం ఉండగా, రెండో దశలో 97.7 శాతానికి పెరిగింది.
♦ సగటున చూస్తే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అనేది మొదట విడత 53.9 శాతం నుంచి రెండో విడతలో 66 శాతానికి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment