ఆన్‌లైన్ ముంచింది.. రూ.3,700 కోట్ల మోసం
లక్నో: సోషల్ ట్రేడ్ మోసం బట్టబయలైంది. రూ.3,700 కోట్ల ఘరానా మోసం బయటపడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట పలువురు అమాయకులకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపుగా ఒక్కొక్కరి నుంచి రూ.57,500 వసూలు చేశారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దీని భారిన పడిన బాధితులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన వారు కూడా చాలామంది ఉన్నట్లు దీనివల్ల బలైనవారిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఈ బిజినెస్ వ్యవహారం సాగినట్లు పోలీసులు చెప్పారు.
ఇంతకీ ఏంటీ సోషల్ ట్రేడ్..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టార్ 63లో అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది సోషల్ ట్రేడ్. బిజ్ అంటూ ఒక సైట్ ను పెట్టి అందులోకి ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట పలువురిని ఆకర్షించింది. తొలుత కొంతమొత్తం కట్టి ఆ సైట్ ఇచ్చే లింక్‌లను క్లిక్ చేస్తుండాలి. అలా చేయడం ద్వారా ఒక్కో క్లిక్‌కు రూ.5వరకు ఇస్తారు.
దాంతోపాటు వారు మరొకరిని అందులో చేర్పిస్తే వారికి అదనంగా మరో క్లిక్ వచ్చి అదనపు సొమ్ము వస్తుంది. ఆ కంపెనీ చేసిన ఈ మాయలో పలువురు ఇరుక్కున్నారు. ఒక్కొక్కరు దాదాపు రూ.50 నుంచి రూ.60 వేలు పెట్టుబడులు పెట్టారు. అనంతరం కంపెనీ బోర్డు తిరగలేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సదరు కంపెనీని గుర్తించి ఓ ముగ్గురుని అరెస్టు చేశారు. వారిని జోరుగా విచారిస్తున్నారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఈ సంస్థ తరుచుగా సైట్ పేరు మార్చుకుంటుండటం విశేషం.