ఎస్‌ఓలు, సీఆర్టీలపై వేటు | actions on so and crt | Sakshi
Sakshi News home page

ఎస్‌ఓలు, సీఆర్టీలపై వేటు

Published Thu, May 11 2017 10:59 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

ఎస్‌ఓలు, సీఆర్టీలపై వేటు - Sakshi

ఎస్‌ఓలు, సీఆర్టీలపై వేటు

- ఎస్‌ఎస్‌ఏ సిబ్బందిలో ఆందోళన
- సరైన నిర్ణయం కాదంటున్న బాధితులు

 
అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రతిభ ఆధారంగా వెనుకబడిన కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లు (ఎస్‌ఓ), సీఆర్టీలను విధుల నుంచి తప్పించడం ఎస్‌ఎస్‌ఏలో కలకలం రేపుతోంది.   కేవలం 2016–17 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల ఆధారంగా ఈ చర్యలు చేపట్టడాన్ని కేజీబీవీల సిబ్బంది తప్పు పడుతోంది. ఆరేళ్లుగా పని చేస్తున్నామని, ఇన్నేళ్లు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఒక ఏడాది తగ్గాయనే కారణంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమంటున్నారు.  కణేకల్‌ ఎస్‌ఓగా ఉన్న రమాదేవి గతేడాది మడకశిరకు వెళ్లారు. ఈమె కణేకల్‌లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్తీర్ణత శాతం తగ్గిందని వేటు వేశారు.  ఉత్తీర్ణత శాతం తగ్గడానికి గల కారణాలను చూపకుండా కేవలం ఎస్‌ఓలు, సంబంధిత సబ్జెక్టు సీఆర్టీలను బాధ్యులను చేస్తే ఎలా? అని వాపోతున్నారు.

సమస్యల సుడిగుండంలో కేజీబీవీలు
సమస్యలు లేని కేజీబీవీ ఒక్కటంటే ఒక్కటీ లేదు. అన్ని కేజీబీవీలూ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆడ పిల్లలు అందులోనూ శారీరకంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు అలాంటి వారికి పౌష్టికాహారం అందించడం చాలా ముఖ్యం. నెలల తరబడి సరుకుల సరఫరా చేసిన టెండరుదారులకు బిల్లులు చెల్లించలేదు. రూ. లక్షల్లో బకాయి ఉండడంతో సరుకులు అంతంతమాత్రంగానే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్‌ఓలు, సీఆర్టీలతో పాటు బోధనేతర సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు మంజూరు చేయలేదు. వీరంతా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్నారు. చాలా కుటుంబాలు జీతాలపై ఆధారపడే జీవిస్తున్నాయి. కేజీబీవీల్లో సిలిండర్లకు ప్రతినెలా రూ. 15–18 వేలు దాకా ఖర్చవుతుంది.

బిల్లులు రాక పోవడంతో ఎస్‌ఓలు చేతినుంచే ఖర్చు పెట్టుకోవాలి. వారికి జీతాలు రాక అల్లాడుతుంటే సిలిండర్లు, కరెంటు బిల్లులకు అప్పులు కూడా పుట్టడం లేదని వాపోతున్నారు. జీతాలు రాకపోవడంతో మరోవైపు కుటుంబాల నిర్వహణ  కష్టంగా మారి సతమతమవుతున్నారు. అటు కుటుంబంలో సమస్యలు, ఇటు కేజీబీవీల ఇబ్బందులతో ఊపిరాడడం లేదని, ఇవన్నీ అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీల్లో చదువుకునే ఆడపిల్లలకు కాస్మోటిక్స్‌ చార్జీ ప్రతినెలా రూ. 100 చెల్లించాలి. సరిగ్గా ఏడాదికి పైగా ఒక్కరూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా అనేక సమస్యలతో అల్లాడుతుంటే వాటి గురించి పట్టించుకోని ఉన్నతాధికారులు కేవలం పదో తరగతి ఉత్తీర్ణత ప్రామాణికంగా చర్యలు తీసుకోవాడం అన్యాయమని వాపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement