తల్లి పాత్రలే గుర్తింపు తెచ్చాయి
తల్లి పాత్రలే గుర్తింపు తెచ్చాయి
Published Thu, Jan 26 2017 11:36 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM
కరప : తల్లి పాత్రలే తనకు మంచి గుర్తింపు తెచ్చాయని నటి అన్నపూర్ణ అన్నారు. మండల కేంద్రమైన కరపలో మాజీ ఎంపీటీసీ ఉడతా అచ్చియ్యమ్మ (డాక్టరమ్మ) 14వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం వచ్చినవామె విలేకర్లతో కొద్దిసేపు మాట్లాడారు. ఇంతవరకూ 850 చిత్రాల్లో నటించానని హీరోయిన్‌గాకంటే కేరక్టర్ యాక్టర్ పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చానని, తర్వాత తల్లిపాత్రలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని అన్నారు. ఎక్కడకు వెళ్లినా ‘అమ్మా అన్నపూర్ణా’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారి అభిమానం మరువలేనిదన్నారు. అందరి అభిమానం పొందడం పూర్వజన్మ సుకృతమన్నారు. చిరంజీవి 150వ చిత్రం, బాలకృష్ణ 100వ చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందన్నారు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంతకాలం సినీ, బుల్లితెరలపై నటిస్తూనే ఉంటానన్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయం ప్రభుత్వాన్ని అడిగేకంటే సినీ దర్శక నిర్మాతలనే అడగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అన్నపూర్ణ, సురేష్ బ్యానర్స్‌పైన, 14 రీల్స్‌తోపాటు తాను నటిస్తున్న మరో చిత్రం నిర్మాణంలో ఉన్నాయని అన్నపూర్ణ చెప్పారు.
హాస్యపాత్రలవల్లే గుర్తింపు
అబ్బ.. జబ్బ.. దెబ్బ..అని, బాబూ చిట్టీ.. అని డైలాగులు చెబుతూ చేసిన హాస్యపాత్రలే తనకు ప్రేక్షకుల్లో ఆదరణ తీసుకొచ్చాయని హాస్యనటి శ్రీలక్ష్మి చెప్పారు. కరపలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంతవరకూ 500 పైగా చిత్రాల్లో నటించానని, ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకులు చూపించే అభిమానం మరువలేనిదని అన్నారు. వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా మంచి అవకాశాలే వస్తున్నాయన్నారు. ఏలూరు సీఐ ఉడతా బంగార్రాజు తమ తల్లి వర్ధంతి కార్యక్రమానికి తమను తీసుకొచ్చి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీలక్ష్మి తెలిపారు.
Advertisement