అదే తీరు.. నిరసనల జోరు
అదే తీరు.. నిరసనల జోరు
Published Fri, Jan 6 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జన్మభూమి గ్రామ సభల్లో నిరసనలు, నిలదీతలు కొనసాగుతున్నాయి. ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకున్న చోట ముందస్తుగా అరెస్ట్‌లు చేయించి గొడవలు జరగకుండా చూస్తున్నారు. నిడమర్రు మండలం అడవికొలనులో ఆక్వా మాఫియా దెబ్బకు పంట పొలాలు దెబ్బతిన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ సమస్యపై రైతులు ఆందోళనలు చేశారు. గురువారం ఆ గ్రామంలో జన్మభూమి సభ సందర్భంగా రైతులు నిలదీస్తారన్నభయంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. మిగిలిన వారిని బెది రించారు. రద్దు చేసిన వృద్ధాప్య పిం ఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో వృద్ధులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. గ్రామంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సాలా దానయ్య, అంపా ముత్యాలు, తాడిపర్తి రామారావు, కంతే వెంకటస్వామి, తాడిపర్తి సుబ్బారావు, జంపా కొండయ్య తదితరులు జన్మభూమి గ్రామ సభ ఎదుట ప్ల కార్డులు చేతబూని తమ పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమకు 2014 వరకూ రూ.200 చొప్పున పింఛను ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పేరుతో రద్దు చేశారని వారు వాపోయారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం జన్మభూమి గ్రామ సభను గిరిజనులు అడ్డుకున్నారు. నాయకపోడు గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు అధికారులను సభలోకి వెళ్లనీయలేదు. గిరిజనుల సమస్యలు పరిష్కరించని కారణంగా సర్పంచ్ మేడి రాములు, ఎంపీటీసీ సత్యవతి జన్మభూమి గ్రామ సభనుంచి వాకౌట్ చేశారు. వెంకటాపురం గ్రామ సభలో చింతలపూడి–నామవరం రహదారి నిర్మాణంౖ కోసం ప్రజలు అధికారులను నిలదీశారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో జెడ్పీ స్కూల్‌లో మధ్యా హ్న భోజనం సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపించారు. దేవరపల్లి మండలం పల్లంట్లలో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాల కోసం అధికారులను నిలదీశారు. అర్హులకు పథకాలు మంజూరు చేయకుండా అనర్హులకు మంజూరు చేస్తున్నారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు పంచాయతీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. వీరవాసరం మండలం రాయకుదురులో అర్హత ఉన్నా తమకు పింఛన్లు ఎందుకివ్వడం లేదని పలువురు వృద్ధులు అధికారులను నిలదీశారు.
Advertisement