ఆదివాసీ మహిళా దీపం
-
సాంకేతికంగా రాణిస్తున్న గిరిజన యువతులు
‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్’ అన్న చిలకమర్తి మాట అక్షర
సత్యమని నిరూపించారు ఆదివాసీ యువతులు. ఇంటింటా అతితక్కువ ఖర్చుతో ఎక్కువ వెలుగులిచ్చే ఎల్‌ఈడీ బల్బుల తయారీలో వారిది అందెవేసిన చేయి అయింది. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రంలో ఆరు నెలల్లోపే రూ. 40 లక్షల సరుకును తయారు చేసి రికార్డు సృష్టించారు. ఈ గిరిజన యువతుల విజయం అందరికీ స్ఫూర్తిదాయకం.
– రంపచోడవరం
ఏజెన్సీలోనే గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో రంపచోడవరంలో ఎల్‌ఈడీ బల్బుల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ భావించారు. ఆయన ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ 42 మంది గిరిజన యువతులను ఎంపిక చేశారు. వారికి బెంగళూరుకు చెందిన సాంకేతిక నిపుణులతో రంపచోడవరం, మారేడుమిల్లిల్లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ల (వైటీసీ)లో శిక్షణ ఇప్పించారు. శిక్షణ అనంతరం ఐటీడీఏ మంజూరు చేసిన రూ. 18 లక్షలతో రంపచోడవరంలోని సెట్రాజ్ భవనంలో ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌ల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ పేరుతో ప్రారంభించిన ఈ ఎల్‌ఈడీ యూనిట్‌కు ఆంధ్రాబ్యాంకు నుంచి రూ. 50 లక్షల రుణం తీసుకున్నారు. ఉత్పత్తి ప్రారంభించిన ఆరు నెలల్లోనే రూ. 40 లక్షల విలువైన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లను తయారు చేశారు. వీటిని ప్రభుత్వం ద్వారా గృహ అవసరాలకు సరఫరా చేశారు.
ఆర్డర్లు ఇలా..
రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘం తయారు చేసిన ఎల్‌ఈడీ ఉత్పత్తులతో శ్రీశైలం ఆలయం మొత్తం లైటింగ్‌ను ఎల్‌ఈడీగా మార్చేందుకు కాంట్రాక్ట్ వచ్చింది. ఇద్దరు ఎలక్ట్రీషియన్లను ఏర్పాటు చేసి అక్కడ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఏపీ ఈపీడీసీఎల్ లక్ష ఎల్‌ఈడీ బల్బులు సరఫరాకు అర్డర్ ఇచ్చింది.అలాగే జిల్లాలో నగరం పంచాయతీ పరిధిలో ఎల్‌ఈడీ కాంతుల నింపేందుకు అర్డర్‌ను దక్కించుకున్నారు.
నిర్వహణ బాధ్యతలన్నీ ఆమెవే..
ఒకప్పుడు ఉద్యోగం కోసం ఐటీడీఏ చుట్టూ తిరిగి విసుగుచెందిన కె. వీరలక్ష్మీ ఎల్‌ఈడీ బల్బుల యూనిట్ నిర్వహణ బాధ్యత చూస్తున్నారు. కొత్త బ్యాచ్‌కు శిక్షణతో పాటు యూనిట్‌లో తయారవుతున్న ఉత్పత్తుల పర్యవేక్షణ, మార్కెట్‌ను కూడా తానే చూస్తున్నారు. కొత్తగా 20 మంది గిరిజన యువతులకు ఎల్‌ఈడీ బల్బులు తయారీపై శిక్షణ ఇస్తున్నారు. యూనిట్‌లో 0.5 వాల్ట్ నుంచి120 వాల్ట్స్ వరకు ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లను తయారు చేస్తున్నారు. వీటిలో చార్జింగ్‌తో పనిచేసే బెడ్‌ల్యాంప్‌లు, చార్జింగ్ లైట్లు కూడా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల ఎల్‌ఈడీ బల్బుల కంటే తక్కువ ధరకే వీరు విక్రయిస్తున్నారు.
300 మందికి ఉపాధే లక్ష్యం
ఈ ఎల్‌ఈడీ బల్బుల యూనిట్ ద్వారా 300 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే నా లక్ష్యం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినా ఇవ్వని తృప్తి స్థానిక గిరిజన యువతులతో కలిసి పనిచేయడంలో లభిస్తోంది. ఎల్‌ఈడీ యూనిట్‌లో టెక్నికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివిన వారితో పాటు ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిన వారిని మాత్రమే ఎంపిక చేసి యూనిట్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. రా మెటీరియల్ కొనుగోలుకు మరికొంత పెట్టుబడి ఉంటే బాగుంటుంది. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్లాం. ఇంజనీరింగ్ చదివి గేట్ పరీక్షలు రాసేందుకు కనీసం రూ. 700 లేని పరిస్ధితి నుంచి అనేక మందికి జీతాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.
–కె వీరలక్ష్మి, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎల్‌ఈడీ యూనిట్, రంపచోడవరం
సొంతప్రాంతంలో ఉపాధి
ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండలేక వారి ఇచ్చే జీతాలు సరిపోక ఇబ్బందులు పడే కంటే సొంత ప్రాంతంలో ఉపాధి దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. ఐటీడీఏ సహకారం ఎంతో ఉంది.
–ఎం శాంతకుమారి, ఎల్‌ఈడీ యూనిట్