కూరగాయల పంటల్లో ‘వేసవి’ జాగ్రత్తలు
అనంతపురం అగ్రికల్చర్ : వేసవిలో అధికంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా కూరగాయల పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో కూరగాయల పంటల యాజమాన్యంపై రైతులకు నిర్వహించిన శిక్షణలో సేంద్రియ విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబుతో కలిసి డాక్టర్ శ్రీనివాసులు అవగాహన కల్పించారు.
పంట మార్పిడి తప్పనిసరి
కూరగాయల పంటల సాగు ద్వారా అధిక దిగుబడులు సాధించాలంటే ఒకేరకమైన పంట వేసుకోకూడదు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. లేదంటే ఎరువులు, నీరు, ఇతరత్రా పెట్టుబడి ఎంత పెట్టినా పంట రావడం కష్టం. రసాయన ఎరువులతో పాటు సమపాళ్లలో సేంద్రియ ఎరువులు తప్పనిసరిగా వాడాలి. వైరస్ తెగులు నివారణకు జాగ్రత్తలు పాటిస్తే కూరగాయల పంటల్లో మంచి దిగుబడులు తీసుకోవచ్చు.
నీటి యాజమాన్యంలో మెలకువలు
ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి యాజమాన్యం విషయంలో మెలకువలు పాటించాలి. ప్రస్తుతం వంగ, మిరప పంటలు, కర్భూజా, కళింగర పంటల నారు పోసుకోవచ్చు. ఏప్రిల్ 15 తర్వాత నాటుకోవాలి. ఇపుడు ఏరకం కూరగాయలు పంటలు సాగు చేసినా మల్చింగ్ పద్ధతి అవలంబించాలి. దీని వల్ల నీటి ఆదా, కూలీల ఖర్చు తగ్గుతుంది. ప్రధాన పొలం చుట్టూ రక్షణ పంటలుగా నాలుగైదు సాళ్లు జొన్న, మొక్కజొన్న, సజ్జ ఒత్తుగా వేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. వీటి వల్ల పురుగులు, తెగుళ్లు, వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు.
- వేసవిలో కూరగాయల పంటల్లో పూత రాలే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఉదయం సమయాల్లో 2 మి.లీ ప్లానోఫిక్స్ + 5 గ్రాములు 19–19–19 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
- రసంపీల్చు పురుగుల నివారణకు 6 నుంచి 8 కిలోలు వేపపిండికి 6 నుంచి 8 కిలోలు కార్బోఫ్యూరాన్ గులికలు లేదంటే 6 నుంచి 8 కిలోలు పిప్రోనిల్ గులికలు ఎకరాకు వేయాలి. తొలకర్లు కురిసే వరకు కూరగాయల పంటలకు పెద్దగా తెగుళ్లు, పురుగులు సోకే అవకాశం ఉండదు. కేవలం నీటి ఎద్దడికి గురికాకుండా కాపాడుకోవాలి.
- బెండ, కాకర, బీర, సొర, దోస, గుమ్మడి , కూర గుమ్మడి, పొద చిక్కుడు, గోరుచిక్కుడు తదితర తీగజాతి కూరగాయల పంటలు సాగు చేసే వారు భూములను బాగా దుక్కి చేసుకుని ఎంపిక చేసుకున్న విత్తనాలను నాటుకోవాలి. నత్రజని స్థాపించే రైజోబియం కల్చరుతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. చివరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 నుంచి 32 కిలోల భాస్వరం, 20 నుంచి 24 కిలోలు పొటాష్ ఎరువులు ఎకరాకు వేసుకోవాలి. నత్రజని ఎరువులను రెండు భాగాలుగా చేసుకుని విత్తిన 25 రోజులు, 45 రోజుల సమయంలో పైపాటుగా వేసుకోవాలి.