ఉద్యానతోటల్లో యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత (ఏప్రిల్) వేసవిలో అరటి, నిమ్మ, సపోటా, దానిమ్మ, బొప్పాయి తోటల్లో ఆశించిన పీడచీడలు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు.
+ వేసవిని దృష్టిలో పెట్టుకుని అరటిలో అవసరాన్ని బట్టి సక్రమంగా నీటి తడులు ఇవ్వాలి. తొండంపై ఎండ పడి పాడుకాకుండా ఎండు అరటి చెత్తతో కప్పాలి. ఆఖరి హస్తం విచ్చుకున్న నాలుగైదు రోజుల తర్వాత 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌ను జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి రెండు సార్లు పిచికారి చేయాలి. గెలలను పాలిథీన్ సంచుల్లో కప్పి ఎండవేడి నుంచి రసం పీల్చు పురుగుల నుంచి రక్షించుకోవాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మిల్లిలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. గెలలు సగం తయారయ్యాక కార్శిపంట (రెండోపంట) కోసం ఒక సూది పిలకను వదిలి మిగతావన్నీ కోసేయాలి.
+ నిమ్మచెట్లపై మంగు నివారణకు 3 మిల్లిలీటర్ల డైకోఫాల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కొత్తగా వేసే తోటల్లో గుంతలు తవ్వి ఆరబెట్టాలి. చెట్ల పాదుల్లో ఎండు ఆకులు లేదా వరిపొట్టును మల్చింగ్‌గా వేసుకుంటే వేసవిలో నీటిఎద్దడికి గురికాకుండా కాపాడుకోవచ్చు.
+ సపోటా లేత తోటలకు తప్పనిసరిగా నీరు పెట్టాలి. తయారైన కాయలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి. తయారైన కాయలపై ఉన్న పొడివంటి పదార్థం రాలిపోయి కాయలు బంగాళాదుంపలా కనపడతాయి. అలాంటి కాయలు చర్మాన్ని గోకినపుడు కండపైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు రంగులో ఉంటుంది. కాయలను తొడిమితో సహా కోయాలి.
+ దానిమ్మ తోటల్లో కత్తిరింపులు చేయడం, పాదులు తవ్వకం, ఎరువులు వేయడం లాంటివి ఇపుడు చేయకూడదు. బ్యాక్టీరియా మచ్చతెగులును అదుపులోకి ఉంచడానికి 1 శాతం బోర్డోమిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకోవాలి.
+ బొప్పాయి తోటల్లో ఇపుడున్న వాతావరణానికి ఆకుడముడు తెగులు ఉధృతి కనిపిస్తుంది. పొలంలో తెల్లదోమ ఉధృతిని గమనించడానికి పసుపు రంగు జిగురు పూసిన కార్డులను ఎకరాకు 15 చొప్పున మూడు అడుగుల ఎత్తులో అమర్చాలి. తెల్లదోమ ఉధృతిని ఉన్నట్లు గమనిస్తే 1 గ్రాము అసిఫేట్ లేదా 0.3 మిల్లిలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 1 గ్రాము డయాఫెన్‌డ్యూరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.