ఖరీఫ్‌లో చిరుపంట సజ్జ
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాధారంగా ఖరీఫ్‌లో చిరుధాన్యపు పంటగా సజ్జ వేసుకోవచచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. ఆరోగ్య పరంగా ఆహార పరంగా చల్లని పంటగా పేరొందిన సజ్జలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు లాభదాయకమన్నారు. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు విత్తుకునేందుకు అనుకూలమంటున్నారు.
సజ్జ గురించి.. : సజ్జ పంటకు జిల్లా భూములు అనువైనవి. భూసారం తక్కువగా ఉన్న భూములు, నీటి నిల్వశక్తి తక్కువగా ఉన్న భూముల్లో కూడా సజ్జ వేసుకోవచ్చు. సజ్జల నుంచి తయారు చేసిన జావ, గంజి వంటి వాటిని తాగటం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇందులో మంచి పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల గింజల నుంచి 361 కిలో కాలరీల శక్తి లభిస్తుంది. ఇనుము ధాతువును అధికంగా కలిగి ఉండటం వల్ల దీని వాడకం రక్తహీనతతో బాధపడేవారికి, స్త్రీలు, పసిపిల్లలకు, వృద్ధులకు చాలా అవసరం. సజ్జ గింజల్లో కెరోటిన్ (100 గ్రాములలో 131 మి.గ్రా) అనే పదార్థము పుష్కలంగా లభించడం వల్ల కంటి చూపునకు చాలా మంచిది. ఆహారం ఆరోగ్యం ఆర్థికపరంగా ఇటీవల సజ్జ పంటకు ప్రాముఖ్యత పెరిగింది.
సాగు యాజమాన్యం : సజ్జలో అధిక దిగుబడినిచ్చే సూటి లేదా కాంపోజిట్ రకాలు ఇసీటీపీ 8203, ఇసీయంవి 221, రాజ్ – 171. అలాగే హైబ్రిడ్ రకాలు హెచ్‌హెచ్‌బి 67, ఇసీయంహెచ్ 356, ఆర్‌హెచ్‌బి 121, జీహెచ్‌బి 538, పిహెచ్‌బి 3, ఎబిహెచ్ 1 అనువైనవి. తేలిక నుంచి మధ్యరకం ఎర్రనేలలు, నీరు ఇంకే భూముల్లో విత్తుకోవాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. ఎకరాకు 1.6 కిలోల విత్తనాన్ని తీసుకుని విత్తే ముందు లీటరు నీటికి 20 గ్రాములు ఉప్పు ద్రావణంలో ఉంచాలి. దీనివల్ల ‘ఎర్గాట్’’ అనే శిలీంధ్ర అవశేషాలను వేరుచేయగలము. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా ఆప్రాన్ 35 ఎస్‌డి లేదా కాప్టాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసుకుని సాళ్ల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12–15 సెం.మీ దూరం ఉండేలా గొర్రుతో విత్తుకోవాలి. వర్షధారపు పంటకైతే ఎకరాకు 50 కేజీల యూరియా, 75 కేజీల సింగల్ సూపర్ పాస్ఫేటు, 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ (ఎంవోపీ) వేయాలి.
యూరియా రెండు భాగాలుగా చేసి విత్తేటప్పుడు సగభాగము, మిగతా సగభాగము పైరు మోకాలు, ఎత్తుదశలో ఉన్నప్పుడు అంటే 25–35 రోజుల పంటకాలంలో నేలలో తగిన తేమ చూసి వేయాలి. విత్తిన రెండు వారాల్లోగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 25–30 రోజులపుడు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయాలి. సజ్జ పంటను వెర్రితెగులు, తేనెబంక తెగులు ఆశించుటకు అవకాశాలు ఉన్నాయి. తేనెబంక తెగులు నివారణకు పూత దశలో 2.5 గ్రాములు మాంకోజెట్ లేదా 1 గ్రాము కార్బొండిజమ్ లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పంటకోతకి వచ్చినప్పుడు కంకుల్లోని సజ్జగింజ కింద భాగాన్ని గమనిస్తే ఒక చిన్న నల్లని చుక్క కనిపిస్తుంది. మొక్కల్లోని అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్లు కనిపిస్తాయి. రెండు మూడు దశల్లో కంకులను కోసి నూర్పిడి చేసుకోవాలి. ఏకపంటగా వీలుకాకపోతే వేరుశనగ, ఇతర పంటల ప్రధాన పొలం చుట్టూ కనీసం నాలుగైదు వరుసలు వేసుకున్నా ప్రధాన పంటకు ఆశించే తెగుళ్లు, పురుగులను అరికట్టడమే కాకుండా అదనపు ఆదాయం పొందవచ్చు.