
విమానం ఎగరావచ్చు..
యూ ఆర్ అటెన్షన్ ప్లీజ్..
ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు ఆదేశం
అందుబాటులో 1591 ఎకరాల భూమి
మొదటి, రెండు దశల్లో విమానాలు నడిపేందుకు వీలు
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు
ఆదిలాబాద్ క్రైం : అడవుల ఖిల్లా ఆదిలాబాద్ నుంచి త్వరలో విమానం గాల్లోకి ఎగరనుంది. ‘‘యూ ఆర్ అటెన్షన్ ప్లీజ్.. మీరు ప్రయూణించాల్సిన విమానం ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది..’’ అనే పిలుపు ఈ ప్రాంత ప్రజల చెవిన పడనుంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ పట్టణంలో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇప్పటికే పట్టణ శివారు ప్రాంతంలో మిలిటరీ ఎయిర్‌బేస్ ఉంది. విమానాశ్రయానికి సంబంధించిన అవసరమైన భూమి ఈ ప్రాంతంలో ఉందని గతంలో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపించింది.
తాజాగా రాష్ట్రంలో కొత్తగూడెంతోపాటు ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా మూడు విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే ఈ మూడు విమానాశ్రయాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెంలో నిర్మించవచ్చని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తగూడెం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు కేంద్రం నుంచి అనుమతులు లభించాయి.
ఆదిలాబాద్ అనువైన ప్రదేశం..
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి సుముఖంగానే ఉంది. విమానాశ్రయ నిర్మాణానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉందని రెండేళ్ల కిందటే అధికారులు గుర్తించారు. సర్వే చేసి 1591 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. అప్పట్లోనే భారత వాయుసేన కార్యకలాపాల విస్తరణ ఉన్నతాధికారులు సైతం స్థలాన్ని పరిశీలించారు. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జిల్లా యంత్రాంగం ఆ స్థలంలో నీటి సరఫరా, విద్యుత్, తదితర సౌకర్యాల కల్పనకు రూ.15 కోట్లు అవసరమని ప్రతిపాదనలు కూడా పంపింది. ఇదిలా ఉండగా కొత్తగూడెంతోపాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వీటిలో కొత్తగూడెం, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయం నిర్మించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ లైన్‌క్లియర్ చేసింది.
అందుబాటులో భూమి..
జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుకు 1,591 ఎకరాల భూమి అందుబాటులో ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమి కూడా ఉంది. ఆదిలాబాద్‌కు ఆనుకుని ఉన్న ఖానాపూర్, అనుకుంట, కచ్‌కంటి, తంతోలి గ్రామాల శివార్లలో ఈ స్థలం ఉంది. అనుకూలంగా ఉన్న భూముల్లో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమే అధికం ఉంది. అప్పట్లో ఖానాపూర్ శివారులోని 50.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 5.20 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని గుర్తించారు. ఖానాపూర్‌లో 431.36 ఎకరాలు, అనుకుంట శివారులో 501.34 ఎకరాలు, కచ్‌కంటి శివారులో 313.24 ఎకరాల వ్యవసాయ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో పాటు తంతోలిలో 256.07 ఎకరాల భూమిని అధికారులు గుర్తించి పరిశీలించారు. మొత్తం 1591 ఎకరాల భూమి అందుబాటులో ఉండడంతో స్థలం సమస్య లేకుండా పోయింది.
ఆనందం.. ఆందోళన..
ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుందనే ఆనందంతోపాటు కాస్త ఆందోళన కూడా ప్రజల్లో వ్యక్తమవుతోంది. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణానికి 1600 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించడంతో పంట భూములు సైతం కోల్పోవాల్సి వస్తుంది. అధికారులు గుర్తించిన 1591 ఎకరాల భూమిలో పంట భూములు సైతం ఉన్నాయి. తంతోలి, అనుకుంట, కచ్‌కంటి గ్రామాల శివారుల్లో సుమారు 1200 ఎకరాల భూమి సాగులో ఉంది. రెండేళ్ల కిందట అధికారులు భూముల సర్వే, పరిశీలన చేయడంతో అప్పట్లో ఆయా గ్రామాల రైతులు ఆందోళన చెందారు. అధికారులను పలుమార్లు కలిసి విన్నవించారు. గుర్తించినంత మాత్రనా భూమి కోల్పోయినట్లు కాదని, ఏర్పాటుకు ఏది అనుకూలంగా ఉంటే అదే తీసుకోవడం జరుగుతుందని అధికారులు వారికి సూచించారు.