పనిభారం పెరిగినంతగా వేతనాలు పెరగలేదు
గాంధీనగర్ : కార్మికులపై పనిభారం పెరిగిందని, దానికి తగ్గట్టుగా వేతనాలు, కూలిరేట్లు పెరగలేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో పౌరసరఫరాల శాఖ ముఠా కార్మికుల సంఘ సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు కార్మిక శక్తిని, సంఘాలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు. వాటిని తిప్పికొట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు అభివద్దికి ఆటంకమన్న చంద్రబాబు తనకుమారుడి నేతత్వంలో టీడీపీ అనుబంధ కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర సంఘాల్లో నాయకులను తమ సంఘం సభ్యులుగా చేరాలని టీడీపీ నాయకులు బలవంతం చేస్తున్నారన్నారు. యూనియన్ నాయకులు వెంటకసుబ్బయ్య, చల్లా చిన ఆంజనేయులు మాట్లాడుతూ అక్టోబర్ 31న ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. కార్మికుల సమస్యలపై నవంబర్ 18న కార్మిక సంక్షేమశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. నవంబర్‌లో శ్రామిక మహిళా ఫోరం మహాసభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కొఠారి వెంకటరమణ, కామేశ్వరరావు, అంజిబాబు, వీరబాబు, మన్మథరావు,, గోవిందరావు పాల్గొన్నారు.