ఉద్యోగులందరికీ పెన్షన్ వర్తింపజేస్తాం
కదిరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగులందరికీ పెన్షన్ వర్తింపజేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడామన్నారు. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో లాగానే ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుచేస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికో ఉద్యోగమిస్తానని హామీ ఇచ్చారని, అలా ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని గుర్తుచేశారు.
ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ఇప్పటి దాకా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన పీఆర్‌సీ, డీఏల విషయంలోనూ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. కాపులను బీసీ జాబితాలో, రజకులను, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వీటన్నింటిపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు ఆర్వేటి శాంతమ్మ, కౌన్సిలర్ రాజశేఖర్‌రెడ్డి,గాండ్లపెంట మండల కన్వీనర్ చంద్రారెడ్డి, నాయకులు గజ్జల రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ నాయకులు జంషీద్, శ్రీనివాసరెడ్డి, మనోహర్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.