గుక్కెడు నీరివ్వలేరా?
- నిలదీసిన ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయ ముట్టడి
- ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ వెన్నపూసతో పాటు పలువురు నాయకుల అరెస్ట్
- ప్రజల దాహార్తి తీర్చలేని చేతగాని ప్రభుత్వమంటూ విశ్వ మండిపాటు
అనంతపురం సిటీ : తాగునీటి సమస్యపై ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు కదంతొక్కారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే, పోలీసులు అప్పటికే కార్యాలయానికి తాళం వేసి.. భారీగా మోహరించారు. పీఏబీఆర్ వద్దనున్న తాగునీటి ప్రాజెక్టు ద్వారా నీరు వదలకుండా తాళం వేసుకుంటారా అంటూ పాలకులపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. ఖాళీబిందెలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి కూడా హాజరై.. సంఘీభావం ప్రకటించారు.
ఆందోళనను ఉద్దేశించి ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు గుక్కెడు నీరు కూడా ఇవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వమిది అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఏబీఆర్ వద్ద 2013లో ఉరవకొండ నియోజకవర్గంలోని 90 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చడం కోసం చేపట్టిన తాగునీటి ప్రాజెక్టుకు రూ.56 కోట్ల నిధులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అప్పుడే 99 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 2015 నవంబరు నాటికి పూర్తి కావాల్సిన ఒక శాతం పనులను టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరికి పూర్తి చేసిందన్నారు. అయినా ప్రాజెక్టు నుంచి గ్రామాలకు నీటిని సరఫరా చేయకుండా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అడ్డు పడుతున్నారని విమర్శించారు. ఇదేమీ ఒక్క కేశవ్ కుటుంబ సమస్య కాదన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ప్రాజెక్టును నిరుపయోగం చేయాలని చూస్తే జనం సహించబోరని హెచ్చరించారు. అభివృద్ధికి ఆటంకంగా మారడం ద్వారా కేశవ్ రాజకీయ జీవిత పతనం మొదలైందన్నారు. ప్రాజెక్టును ప్రారంభించాలంటూ గత నెల 13న కార్యాలయాన్ని ముట్టడించామని, 14న మంత్రి కాలవ శ్రీనివాసులును కూడా కలిశామని గుర్తు చేశారు. 15న కలెక్టర్ జి.వీరపాండియన్ ప్రాజెక్టును సందర్శించినా స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను వేసిన రోడ్డులో నడుస్తూ.. తానిచ్చే పింఛన్లతో తింటూ టీడీపీకి ఓటు వేయకుంటే ఎలా అంటూ బెదిరింపులకు దిగుతున్న చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పిచ్చాస్పత్రి లేనందున కేసీఆర్‌తో మాట్లాడి హైదరాబాద్‌లోని యర్రగడ్డ ఆస్పత్రిలో చంద్రబాబును చేర్చాల్సిందేనన్నారు.
పోలీసుల ఓవరాక‌్షన్...
ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని కలిసేందుకు అవకాశం ఇవ్వండి.. లేదంటే వారినే ఇక్కడకు రమ్మనండి అని వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు కోరినా పోలీసు అధికారులు స్పందించలేదు. వందల సంఖ్యలో వచ్చిన పోలీసులు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేసి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నేతలకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం అరెస్టయిన వారందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో కూడేరు జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రాజశేఖర్, సర్పంచులు రామకృష్ణ, వెంకటరమణ, కిష్టప్ప, అంజమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.