ఎవరి ధీమా వారిదే
ఎవరి ధీమా వారిదే
Published Sun, Nov 22 2015 2:42 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
వరంగల్ లోక్‌సభ స్థానంలో గెలుపుపై పార్టీల అంచనాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగియగానే ఓటింగ్ సరళిపై రాజకీ య పార్టీలు అంచనాల్లో పడ్డాయి. గెలుపుపై ఎలాంటి అనుమానాల్లేవని, కేవలం మెజారిటీ కోసమే వరంగల్‌లో పనిచేశామంటూ టీఆర్‌ఎస్ ధీమాగా ఉంది. ఇక పోలింగ్ శాతం తగ్గడం, హామీలను అమలు చేయనందుకు ప్రభుత్వంపై వ్యతిరేకతకుతోడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తాము బాగా పుంజుకున్నామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం, వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం వివిధ పథకాలు, టీడీపీతో పొత్తు వంటి వాటితో గెలుపు అవకాశాలున్నాయని బీజేపీ చెబుతోంది.
టీఆర్‌ఎస్‌కు అనుకూలమంటున్న 'ఎగ్జిట్'
సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియంకు 3.95 లక్షల మెజారిటీ వచ్చింది. ఉప ఎన్నికలోనూ ఆ పార్టీయే గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్, సర్వేలు చెబుతున్నాయి. లక్ష నుంచి లక్షన్నర దాకా మెజారిటీ రావొచ్చని పేర్కొంటున్నాయి. అయితే ఓటింగ్‌శాతం తగ్గడంతో టీఆర్‌ఎస్ విజ యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపఎన్నికల్లో సాధారణంగానే పోలింగ్ శాతం తగ్గుతుందని టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ‘ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరిగిందనే ప్రచారం కోసం కొందరు మెజారిటీ అంటూ వాదనను తెరపైకి తెస్తున్నారు. ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వ మనుగడపై ప్రభావమేమీ ఉండదనే కారణంతో ఓటర్లు నిరాసక్తత చూపుతారు.’’ అని ఒక మంత్రి పేర్కొన్నారు.
తడబడి.. నిలదొక్కుకున్న కాంగ్రెస్
తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో దుర్ఘటనతో కాంగ్రెస్‌పార్టీ షాక్‌కు గురైంది. ఆ వెంటనే సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా తెరపైకి తెచ్చి తేరుకుంది. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్, కేంద్ర హోంమంత్రిగా ఉన్న సుశీల్‌కుమార్ షిండేతోపాటు ఆజాద్, దిగ్విజయ్ వంటి జాతీయ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా ఉన్న సానుకూలత, తెలంగాణ బిల్లుకోసం మద్దతిచ్చిన పార్టీగా, వరంగల్‌కు పలు పథకాలను ప్రకటించడం వంటివి ఈ ఉప ఎన్నికలో ఉపయోగపడతాయని బీజేపీ ఆశిస్తోంది.
Advertisement
Advertisement