నిర్బంధాలతో ఉద్యమం ఆగదు
దివీస్‌పై అఖిలపక్ష నాయకులు
కాకినాడ సిటీ : తొండంగి మండలంలో నిర్మించతలపెట్టిన దివీస్ కంపెనీ విషయంలో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఉద్యమం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. శనివారం స్థానిక సుందరయ్యభవన్‌లో అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆరు నెలలుగా తొండంగి మండలంలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ దౌర్జన్యంగా దివీస్ నిర్మాణం ఎందుకు సాగించాల్సి వస్తోందని, ప్రజలు ప్రశ్నించే చోటల్లా 144 సెక‌్షన్ విధించడం ఏమీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజలను వారి భూముల్లోకి వెళ్లనీయకుండా దౌర్జన్యంగా అడ్డగించడం దారుణమన్నారు. దివీస్ యాజమాన్యం దౌర్జన్యంగా ఆక్రమించి గోడ నిర్మిస్తోందని రైతులు రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకుండా ఆక్రమణదారులవైపే ఎందుకు ఉండాల్సి వస్తుందో బహిరంగ పర్చాలన్నారు. డ్రోన్ కెమెరాలను ఉద్యమాలను అణచడానికి ఉపయోగించడం హాస్యాస్పదమన్నారు. ఆరు నెలలుగా పోలీస్ పికెట్ నడుపుతున్నా పాలకులు ఒక్కసారి కూడా ప్రాంత ప్రజల గోడు వినకపోవడంతో వారు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ నాగేశ్వరరావు, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు మోతా కృష్ణమూర్తి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషుబాబ్జి, ఐఎన్‌టీయూసీ నాయకులు రోకళ్ళ సత్తిరాజు, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు.
25కెకెడి151: అఖిలపక్ష నాయకుల సమావేశం