నిర్మల్‌ను జిల్లాగా చేయాల్సిందే..!
► లేదంటే తెలంగాణ స్ఫూర్తితో ఉద్యమిస్తాం
► అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
నిర్మల్‌రూరల్ : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మల్ కేంద్రంగా కొత్తజిల్లాను ప్రకటించాలని, లేనిపక్షంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జిల్లా ఏర్పడే వరకు ఉద్యమిస్తామని అఖిలపక్షాల నాయకులు ముక్తకంఠంతో నినదించారు. నిర్మల్‌ను జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వివేక్‌చౌక్‌లో వివిధ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల వారు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అర్హతలు లేని కొన్నిప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం అన్ని అర్హతలున్న నిర్మల్‌ను విస్మరించడం శోచనీయమన్నారు. ముథోల్, బాసర్, భైంసా, ఖానాపూర్, కడెం, బోథ్, నేరేడిగొండ తదితర ప్రాంతాల ప్రజలకు మధ్యలో ఉన్న నిర్మల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు.
సర్కారు పేర్కొన్న నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్ జిల్లా ఏర్పాటు కావల్సిందేనని చెప్పారు. ప్రజల బలమైన ఆకాంక్షతో పాటు ఈ ప్రాంత అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. జిల్లాను సాధించుకునే వరకు తీరొక్క నిరసనలతో ముందుకు సాగుతామన్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు. జిల్లా సాధనోద్యమంలో అన్నిసంఘాలు, వర్గాల వారు పాల్గొనాలని సాధన సమితి సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి, కన్వీనర్ నాయిడి మురళీధర్, కో-కన్వీనర్ వెంకటేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామలింగం, జమాల్, పద్మాకర్, బీజేపీ నాయకులు శశివర్మ, హరివర్మ, రాజులదేవి శ్రీనివాస్, రాజేందర్, టీడీపీ పట్టణాధ్యక్షుడు గండ్రత్ రమేశ్, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు ఎస్‌ఎన్‌రెడ్డి, పలువురు మైనార్టీ సెల్ నాయకులు, టీవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు, టీఎన్జీవోస్ తాలూక అధ్యక్షుడు ప్రభాకర్, ఎస్టీయూ బాధ్యులు లక్ష్మణ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.