జిల్లా పశుసంవర్దక శాఖ జేడీ మెట్ట వెంకటేశ్వరులు
పశుమిత్రల పోస్టుల భర్తీకి చర్యలు
Published Sat, Sep 3 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
కరవంజ(జలుమూరు): జిల్లాలో పశుగణాబివృద్ధితోపాటు పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు జిల్లాలో 494 మంది పశుమిత్రలను ఈ నెలాఖరులోగా నియమిస్తామని జిల్లా పశుసంవర్దక శాఖ జేడీ మెట్ట వెంకటేశ్వరులు తెలిపారు. పశుసంవర్దక శాఖ దిననోత్సవం సందర్భంగా కరవంజలో పశువైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాధారణ నాటుదూడలకు ఎద తెప్పించి మేలు రకం పశువులు ఉత్పత్తి చేసేందుకు ఈ నెల 7న జిల్లా వ్యాప్తంగా 500 పశువులకు 847 హర్మోన్ వ్యాక్సిన్లు వేస్తామన్నారు. దీని వల్ల అక్టోబర్ రెండున ఇవి ఎదకు వస్తాయని చెప్పారు.
జిల్లాలో 7.20 లక్షల గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు రెండు లక్షలు పూర్తిచేశామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా రెండో స్థానంలో నిలిచిందన్నారు. చిత్తూరు జిల్లా 2.40లక్షలు టీకాలు వేసి ప్రథమ స్థానంలో ఉన్నట్టు వెల్లడించారు. నెల్లూరు నుంచి విత్తన పొట్టేళ్లను తెప్పించి అధిక మాంసం దిగుబడినిచ్చే జీవాల వృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు.
Advertisement