యూనివర్సిటీలకు 740 ఎకరాలు | Amaravathi CRDA allots 740 acre land for private universities | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీలకు 740 ఎకరాలు

Published Sun, Jun 12 2016 9:20 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

Amaravathi CRDA allots 740 acre land for private universities

-ఆరు వర్సిటీలకు ఇచ్చేందుకు అంగీకారం
-మలి విడతలో మరో రెండు సంస్థలకు
-25 సంవత్సరాలు లీజు లేదా అమ్మకానికి
విజయవాడ: నూతన రాజధాని అమరావతిలో ప్రైవేటు యూనివర్సిటీలకు రెండు దశల్లో 890 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. తొలి దశలో ముందుగా మూడు వర్సిటీలకు 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 150 ఎకరాలు, వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)కి 200 ఎకరాలు, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 150 ఎకరాలను ఇవ్వనుంది. ఈ నెల 15న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కేటాయింపులకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే తొలి దశ కిందే మరో రెండు యూనివర్సిటీలకు భూములు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అమిటి యూనివర్సిటీకి 150 ఎకరాలు, సీఐఐ యూనివర్సిటీకి 90 ఎకరాలు ఇవ్వనుంది. మొత్తం మొదటి దశలో ఈ ఐదు వర్సిటీలకు 740 ఎకరాలను కేటాయించి రెండేళ్లలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ రూ.1677 కోట్లు, విట్ రూ.3,483 కోట్లు, ఇండో-యూకే సుమారు రూ.2 వేల కోట్లు, సీఐఐ యూనివర్సిటీ రూ.500 కోట్లు, అమిటి యూనివర్సిటీ రూ.425 కోట్ల పెట్టుబడులను పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాయి. పదేళ్లలో మొత్తం 83,038 మంది విద్యార్థులకు ప్రత్యేక కోర్సుల్లో ఇవి విద్యా బోధన చేయనున్నాయి.

రెండో దశలో కారుణ్య యూనివర్సిటీకి 150 ఎకరాలు, సవిత యూనివర్సిటీకి వంద ఎకరాలు కేటాయించాలనే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అమృత యూనివర్సిటీ, హాస్పిటాలిటీ యూనివర్సిటీకి రాజధానిలో భూములిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో కొన్ని లీజు పద్ధతిలోనూ, మరికొన్ని విక్రయ హక్కుల ద్వారా భూములివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎకరం రూ.25 లక్షల చొప్పున 25 సంవత్సరాల లీజుకిచ్చేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. అమ్మకం ద్వారా అయితే ఎకరం రూ.50 నుంచి రూ.70 లక్షలకు ఆ సంస్థలకు భూములివ్వాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే, ఈ భూములు 29 గ్రామాల్లో ఎక్కడ ఇవ్వాలనే దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తొలిదశలో ఇచ్చే మూడు సంస్థలకు భూమి ఎక్కడ ఇవ్వాలనే నిర్ణయం ఖరారైనట్లు తెలిసినా.. ఆ వివరాలను ఇంకా వెల్లడించలేదు. రాజధానిలో ప్రతిపాదిత ఏడు థీమ్ సిటీల్లో ఒకటైన ఎడ్యుకేషన్ సిటీలో ఎక్కువ వర్సిటీలకు భూములివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని సంస్థలకు అక్కడే భూమి ఇవ్వాలంటే కష్టమవుతుందనే అభిప్రాయం సీఆర్‌డీఏలో వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement