సిగ్గు శరం ఉంటే ఉరవకొండలో చర్చకు రా!
టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చకు రావాలని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాలు విసిరారు. వాళ్లకు దమ్ముంటే సీబీఐ విచారణకో, సిట్టింగు జడ్జితో విచారణకో సిద్ధం కావాలని, లేనిపక్షంలో ఈ ఆరోపణలన్నింటినీ వాళ్లు అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. తాను బినామీ పేర్లతో కొనలేదని, మగాడిలా తన కొడుకు పేరుమీదే భూమి కొన్నానని పయ్యావుల కేశవ్ చెప్పడంపై ఆయన మండిపడ్డారు. మీరు మగాడిలా కొంటే.. మరి బినామీ పేర్లతో కొన్న చంద్రబాబు, లోకేష్, నారాయణల పరిస్థితేంటి.. వాళ్లు మగాళ్లు కారా అని ప్రశ్నించారు. మగాడిలా కొన్నానంటున్నావే.. రావెల కిశోర్ బాబు భార్య కూడా డైరెక్టుగా నీలాగే కొన్నారని ఆయన అన్నారు. అసలు అక్కడ ఎందుకు కొన్నారు.. రాజధాని వస్తోందని ముందే తెలిసి కొన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఆ విషయం చెప్పకుండా జగన్ మీద ఆరోపణలు చేయడం, నిందలు వేయడం ఎందుకని నిలదీశారు.
ఇకమీదట ఈ కథనాలు రాయొద్దంటూ రాత్రి 11 గంటల వరకు సాక్షిలో స్ట్రింగర్ నుంచి వాచ్‌మన్ వరకు అందరి దగ్గరకు కాళ్ల బేరానికి వచ్చిన మాట వాస్తవమా కాదా అని అంబటి రాంబాబు కేశవ్‌ను ప్రశ్నించారు. ఉరవకొండ వచ్చి చర్చించేందుకు తాము సిద్ధమని, మీ మొహానికి జగన్ మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే ఉరవకొండలో చర్చిద్దాం రా.. అని సవాలు విసిరారు. రాయలసీమలో పుట్టినవాడివి.. రాజధాని ప్రాంతం గురించి ముందే తెలుసుకుని, అక్కడ భూములు కొనే నక్కజిత్తులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. మగాడినని ప్రగల్భాలు పలకడం కాదు, చేతల్లో చూపించుకోవాలని హితవు పలికారు.
ఇప్పుడు పయ్యావుల కొత్త పల్లవి అందుకుంటున్నారని, ఇప్పటివరకు సీబీఐ దృష్టికి రాని కొన్ని వాస్తవాలను వాళ్లు బయటకు తీస్తామంటున్నారని, కడపలో ఉన్న బినామీ మైనింగులను కూడా తీస్తామని చెబుతున్నారని.. మరి ఇన్నాళ్లూ గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎందుకు బయటకు తేలేదు? ఇన్నాళ్లూ ఎందుకు దాచావు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా పయ్యావుల కేశవ్ గారూ అని నిలదీశారు. కేవలం వాళ్ల మీద వార్త వచ్చింది కదాని బెంబేలెత్తిపోతున్నారన్నారు. అన్నీ బయటపడ్డాక ప్రకాశం బ్యారేజి మీదకు వస్తారో, పట్టిసీమకు వస్తారో చర్చకు తాము సిద్ధమని తెలిపారు. మీ పెదబాబు, చినబాబు, పరివారం మొత్తాన్ని తీసుకురావాలని అన్నారు. మీ నాయకులు బినామీ పేర్లతో కొన్న స్థలంలోకి వస్తారో.. మీ అబ్బాయి పేరు మీద కొన్న నాలుగెకరాల్లోకి వస్తారో రావాలని సవాలు చేశారు.
అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానన్న చంద్రబాబు.. ఇప్పుడు లింగమనేని వారు అక్రమంగా కట్టిన అవినీతి బంగ్లాలో నిద్రపోతున్నారని, టీడీపీ నేతలు అంతా సిగ్గుమాలిన పనులు చేస్తూ, నిప్పుతొక్కిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణ ఎదుర్కోడానికి సిద్ధం కావాలి తప్ప జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లి తప్పుకోవాలని చూడద్దని హితవు పలికారు.
కాపు రిజర్వేషన్ల విషయంలోను, ఇతర విషయాల్లోను తామిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారని అంబటి ప్రశ్నించారు. మద్రగడ పద్మనాభం ఉద్యమం, మంద కృష్ణమాదిగ పోరాటాల వెనుక జగన్ హస్తం ఉందని అంటున్నారని.. ప్రతి దాని వెనక ఆయన హస్తం ఉండటం ఏంటి, బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు.
మరోవైపు.. అసలు చంద్రబాబు లాంటి నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రిగా రావడం తెలుగుప్రజల అదృష్టం అని వెంకయ్యనాయుడు అంటున్నారని, దాన్నిబట్టి చూస్తే చంద్రబాబు విలువలు పెరిగిపోయాయో, వెంకయ్య విలువలు దిగజారిపోయాయో అర్థం కావట్లేదన్నారు. ఈ నీచ వ్యవహారంపై కేంద్రం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచస్థాయి రాజధాని పేరుతో లోకేష్, చంద్రబాబు బినామీ పేర్లతో ప్రపంచస్థాయి దోపిడీ జరుపుతున్నారని ఆయన మండిపడ్డారు.