అగ్రస్థానంలో ‘అనంత’
– జిల్లాను సమష్టిగా అభివృద్ధి చేసుకుందాం
– సంక్షేమాన్ని పేదల దరి చేర్చుదాం
-హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
– గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ పిలుపు
అనంతపురం అర్బన్ : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సమష్టిగా, త్రికరణ శుద్ధితో కృషి చేద్దామని కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. సంక్షేమాభివృద్ధిని పేదల దరిచేర్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గురువారం అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన 68వ గణతంత్ర వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సందేశాన్ని వినిపించారు. ప్రభుత్వం నిర్దేశించిన రెండంకెల వృద్ధి రేటును సాధించామన్నారు. ఈ ఏడాదిలో జిల్లా స్థూల ఉత్పత్తిలో 19.23 శాతం పెరుగుదల రేటును సాధించడానికి చర్యలు చేపట్టామన్నారు.
వర్షాభావంతో నష్టపోయిన జిల్లా రైతులను ఆదుకునేందుకు రూ.2,161 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని ఇటీవల కేంద్ర కరువు బృందాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. హంద్రీ–నీవా నీటితో రిజర్వాయర్లు, చెరువులను నింపడం ద్వారా కరువు శాశ్వత నివారణకు, వాతావరణ బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలతో పంట నష్టపోయిన రైతులను తాత్కాలికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా రూ.367.80 కోట్ల వాతావరణ బీమా పరిహారాన్ని ప్రకటించిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.29.46 కోట్ల విలువైన 6,489 వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. పశుగ్రాసం కొరతను గట్టెక్కేందుకు ఐదు వేల ఎకరాల్లో సామూహిక గ్రాసం పెంపకానికి చర్యలు చేపట్టామన్నారు.
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి సబ్సిడీలను మంజూరు చేయడంతో పాటు, జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ఏడాది 35 వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యపు పరికరాలను అమర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు.అలాగే మల్బరీ సాగుపైనా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సీ) ఆధునికీకరణకు రూ.458 కోట్లతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు రూ.240 కోట్లు ఖర్చు చేశామన్నారు. హెచ్‌ఎల్‌సీ ద్వారా పీఏబీఆర్ కుడికాలువ కింద 36 చెరువులకు, 45 చెక్ డ్యాంలకు, మిడ్ పెన్నార్ దక్షిణ కాలువ కింద 14 చెరువులకు, 15 చెక్‌డ్యాంలకు నీటిని ఇచ్చామన్నారు. 31,813 ఎకరాల ఆయకట్టుకూ అందించామన్నారు.
హంద్రీ–నీవా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. దీని ద్వారా జిల్లా రైతులకు గరిష్టంగా నీటిని అందించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. హంద్రీ–నీవా ద్వారా ఈ ఏడాది 19 టీఎంసీల నీటిని జిల్లాకు ఇచ్చారన్నారు. ఇందులో 12.50 టీంఎసీలను పీఏబీఆర్‌కు ఇచ్చామన్నారు. మొదటి దశ, రెండో దశ కాలువల ద్వారా 37 చెరువులను, 72 చెక్‌డ్యాంలను నింపామన్నారు. జిల్లాను శాశ్వత కరువు రహితంగా మార్చేందుకు బీటీ ప్రాజెక్టు, పేరూరు జలాశయాల తొలిదశ పనులకు రూ.6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని సీఎం ప్రకటించారన్నారు. నీరు–ప్రగతి, నీరు–చెట్టు పథకాల ద్వారా రూ.300 కోట్లతో 4,402 చిన్ననీటి వనరులు, 91 గొలుసుకట్టు చెరువులు తదితర వాటిని పునరుద్ధరించామన్నారు.
జిల్లాను హరిత అనంతగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగా 99,954 తెల్ల రేషన్ కార్డులను పేదలకు మంజూరు చేశామన్నారు. జిల్లాను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. రూ.167 కోట్లతో 382 కిలోమీటర్ల పొడవునా రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అమృత్ పథకం కింద మంచినీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి రూ.30 కోట్లతో పనులు చేపట్టామన్నారు.