ఒడిశాలో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. తెలుగు యాత్రికులను ప్రమాదానికి గురిచేసి, వారంతా ఆ షాక్ నుంచి తేరుకోకమునుపే నిలువుదోపిడీ చేశారు. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. వివరాలివీ.. గుంటూరు జిల్లా నర్సరావుపేట, ముప్పాళ్ల, ఈపూరు, రొంపిచెర్ల ప్రాంతాలకు చెందిన దాదాపు 35 మంది ప్రయాణికులు ఈనెల 20వ తేదీన తీర్థయాత్రలకు బయలుదేరారు.
వారి బస్సు సోమవారం రాత్రి ఒడిశా రాష్ట్రం కటక్ సమీపంలోని అటవీప్రాంతం గుండా వెళ్తుండగా దోపిడీ దొంగలు రోడ్డుపై అడ్డంగా ఉంచిన రాళ్లను ఢీకొట్టి పడిపోయింది. దీంతో బస్సు ప్రయాణికులు హాహాకారాలు చేస్తుండగానే అక్కడే మాటువేసి ఉన్న దుండగులు వారిని బెదిరించి నగదు, ఆభరణాలు, సెల్‌ఫోన్లు, విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో బస్సులోని తులశమ్మ మరణించగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. తులశమ్మ స్వస్థలం నరసరావుపేట మండలం బరంపేటగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
చినరాజప్ప ఆరా..
ఈ ఘటనపై మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఒడిశా అధికారులతో ఆరా తీశారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం రాష్ట్రానికి పంపాలని, అలాగే క్షతగాత్రులకు చికిత్స చేయించి వెనక్కి పంపించాలని ఆ రాష్ట్ర విపత్తు నిర్వమణ శాఖ ముఖ్య కార్యదర్శి మహాపాత్రను కోరారు. కాగా ఏపీ డీజీపీ రాముడు.. ఒడిశా డీజీపీతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.,