వ్రతాల రేట్లు పెంచకండి
వ్రతాల రేట్లు పెంచకండి
Published Wed, Sep 7 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
‘డయల్ టు ఈఓ’లో ఓ భక్తుని సూచన
పలు అంశాలను ప్రస్తావించిన భక్తులు
అన్నవరం: సత్యదేవుని ఆలయంలో సామాన్య భక్తులు ఎక్కువగా ఆచరించే రూ.150, రూ.300, రూ.700 వ్రతాల రేట్లు రూ.50 నుంచి రూ.వంద వరకూ పెంచాలనుకోవడం తగదని కాకినాడకు చెందిన పి.మాధవరావు అనే భక్తుడు వ్యాఖ్యానించారు. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలని కోరారు. ఈఓ నాగేశ్వరరావు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ ‘డయల్ టు ఈఓ’ నిర్వహించగా పలువురు భక్తులు పెక్కు అంశాలకు సంబంధించి ఫోన్లు చేశారు.
మాధవరావు మాట్లాడుతూ గతంలో వ్రతం టిక్కెట్ రూ.75 మాత్రమే ఉండేదని, అప్పుడు ఇచ్చిన దానికన్నా తక్కువ పరిమాణంలో పూజాసామాగ్రి ఇస్తున్నారని, రేటు మాత్రం భారీగా పెంచేశారని అన్నారు. ఈఓ సమాధానమిస్తూ వ్రతనిర్వహణ సామగ్రి ధరలు పెరిగినందున టిక్కెట్ల రేట్లు పెంచక తప్పడం లేదన్నారు. రూ.1,500 వ్రతం టిక్కెట్ మినహా మిగిలిన వ్రతాల టిక్కెట్ ధరలు పెంచాలన్న పాలకవర్గం ప్రతిపాదనకు కమిషనర్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు.
కాగా ఈఓకి వచ్చిన మరికొన్ని ఫోన్ల వివరాలివి.. కొన్ని అభియోగాలపై తొలగించిన వ్రతపురోహితుడు డీఎస్‌వీవీఎన్ శర్మ స్థానంలో ఆయన కుమారుడి నియామకం అక్రమమని కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు వ్యాఖ్యానించారు. శర్మను గత మేలో కొన్ని కారణాల వల్ల తొలగించామని,, గత నెలలో ఆయన కుమారుడిని వ్రతపురోహితునిగా నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని ఈఓ తెలిపారు.అయితే సర్వీస్ నుంచి తొలగించిన పురోహితుని కుమారుడిని ఎలా నియమిస్తారనే విమర్శలు రావడంతో నియామకాన్ని నిలిపివేశామన్నారు. కమిషనర్ తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాపేశ్వరానికి చెందిన జోగానందం దేవస్థానం కాఫీ, టీ పాయింట్‌లలో కాఫీ నాణ్యతగా లేదని ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామన్నారు.
కుర్చీలో కూర్చుని వ్రతమా?
అమలాపురానికి చెందిన భీమశంకర్ ఆచార సంప్రదాయాలకు విరుద్ధంగా మాజీ ప్రధాని దేవెగౌడను కుర్చీలో కూర్చోబెట్టి వ్రతం చేయించడాన్ని తప్పుపట్టారు. అయితేS ఆరోగ్యం సహకరించని వారికి పీటల మీద కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఈఓ వివరించారు. మెట్లదారిలో రత్నగిరికి వచ్చే భక్తులకు మంచినీటి సదుపాయం కల్పించాలని కాకినాడకు చెందిన రాఘవేంద్రరావు కోరగా చర్యలు తీసుకుంటామని ఈఓ చెప్పారు.
నిత్యకల్యాణంలో పాల్గొనే భక్తులను పల్లకీబోయీలు డబ్బులు అడుగుతున్నారని గంగవరానికి చెందిన సతీష్ ఫిర్యాదు చేశారు. దేవస్థానం గోవులకు మంచిమేత పెట్టాలని, దేవస్థానం వైద్యశాల వైద్యుడు వేళకు విధులకు హాజరయ్యేలా చూడాలని అన్నవరానికి చెందిన సూర్యప్రకాశరావు కోరారు. దేవస్థానంలో మోటార్ సైకి ల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని సామర్లకోటకు చెందిన సత్యనారాయణ సూచించారు. పెంచిన డీ ఏ ముందుగా పెన్షనర్లకే చెల్లించేలా చూడాలని దేవస్థానం పెన్షనర్ల సంఘం నాయకుడు వరహాలు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏసీ జగన్నాథరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement