రూ.20 లక్షలు అప్పిచ్చి ఎకరం పొలం కాజేశారు
కలర్ జిరాక్సులతో మోసం
రియల్టర్ల మాయాజాలం
ఆందోళనతో అనారోగ్యం పాలైన బాధితుడు
విజయవాడ : విజయవాడ నగరంలో కాల్‌మనీ వ్యాపారుల మోసాలు రకరకాలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈసారి రియల్టర్ల ముసుగులో ఈ మాయాజాలం చోటుచేసుకుంది. వారి మోసానికి బాధితుడు మానసిక రోగిగా మారి మాట్లాడలేని స్థితికి చేరాడు. బాధితుడి భార్య కథనం మేరకు వివరాలివీ.. భవానీపురం గాంధీబొమ్మ రోడ్డులో షేక్ శ్రీను, రసూల్‌బీ దంపతులు నివసిస్తున్నారు. శ్రీను పాల ఫ్యాక్టరీలో ముఠాకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించేందుకు, చిన్నచిన్న అప్పులు తీర్చేందుకు తన పొలాన్ని తాకట్టు పెట్టాలనుకున్నాడు.
భవానీపురం హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని సాయి నిర్మాణ్ అపార్ట్‌మెంట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆచంట రాజశేఖర్, చెల్లుబోయిన ఆంజనేయులును కలుసుకున్నారు. 2015 మే 28న పి.నైనవరంలోని తన ఎకరం పొలం తాలూకు డాక్యుమెంట్లను ఇచ్చాడు. దీంతో రాజశేఖర్ తన దగ్గర పనిచేసే చిట్టినగర్‌కు చెందిన నమ్మి శ్రీనివాసరావు పేరుమీద జీపీ (తనఖా రిజిస్ట్రేషన్) చేయించుకుని రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు.
వడ్డీ పెరిగిపోతుందని భావించిన శ్రీను మూడు నెలల అనంతరం (ఆగస్టు) మరోచోట ఉన్న పొలం అమ్మి రాజశేఖర్‌కు అసలు, వడ్డీతో కలిపి బాకీ తీర్చేశాడు. అయితే రాజశేఖర్ అతనికి తనఖా పెట్టిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా వాటి కలర్ జిరాక్సులు ఇచ్చి పంపించాడు. అవే ఒరిజినల్ డాక్యుమెంట్లు అనుకుని శ్రీను వాటిని తీసుకుని వెళ్లిపోయాడు.
నెలన్నర తర్వాత గుర్తింపు...
నెలన్నర తరువాత శ్రీను తన పొలం వద్దకు వెళ్లగా, నీ పొలం అమ్మేశావట గదా.. వాళ్లు ఈ మధ్యే వచ్చి వెళ్లారని చుట్టుపక్కలవాళ్లు అనటంతో కంగుతిన్నాడు. వెంటనే రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఈసీ తీయించగా జీపీ చేయించుకున్న తొమ్మిదో రోజునే చిట్టినగర్‌కు చెందిన కొర్రపాటి శ్యాంప్రసాద్ (చెల్లుబోయిన ఆంజనేయులు బినామీ) పేరుతో 60 సెంట్లు రిజిస్టర్ అయి ఉంది.
సెప్టెంబర్ 19న గుంటూరుకు చెందిన కొప్పినేని కోటేశ్వరరావు (రాజశేఖర్ బినామీ) పేరు మీద 40 సెంట్లు రిజిస్టర్ అయి ఉంది. ఇదంతా చూసిన శ్రీను మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలయ్యాడు. దీంతో భార్య ర సూల్‌బీ తన కుటుంబ సభ్యులతో కలిసి డిసెంబర్‌లో భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారినుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఈ ఏడాది జనవరి 12న నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్లాట్లుగా అమ్ముకునే యత్నాల్లో రియల్టర్లు...
తమ బినామీల పేరుమీద రిజిస్టర్ చేయించుకున్న రాజశేఖర్, ఆంజనేయులు ఇప్పుడు ఆ పొలాన్ని ప్లాట్లుగా గానీ, ఏక మొత్తంగా గానీ అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పొలం కోటి రూపాయలకుపైనే పలుకుతుందని సమాచారం.
ఇదెక్కడి న్యాయమని రాజశేఖర్, ఆంజనేయులును ప్రశ్నిస్తే శ్రీను స్నేహితులపై, బంధువులపై కేసులు పెడుతున్నారని శ్రీను బావమరిది హుస్సేన్ తెలిపారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి తమను మోసగించిన వారిపై చర్యలు తీసుకుని తమ పొలం తిరిగి ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.