సర్వజనాస్పత్రిలో ఓపీకి మరో కౌంటర్!
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వస్తున్న రోగుల ఇబ్బందులు తొలగించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇటీవల ఔట్ పేషెంట్స్ (ఓపీ), ఇన్‌పేషెంట్స్ (ఐపీ) అధికమవుతోంది. సాధారణ రోజుల్లో ఐపీ 600 వరకు ఉంటుండగా, ప్రస్తుతం అది 900 వరకు చేరింది. ఇక ఓపీ 1000 వరకు ఉంటుండగా ఇటీవల రెండు వేల వరకూ పెరిగింది. వారం రోజులుగా 1,400 నుంచి 1,500 మధ్యలో కొనసాగుతోంది. గురువారం మొత్తం 1,410 మంది ఓపీకి వచ్చారు.
రోజూ ఉదయం 9 గంటల నుంచి ఓపీ కౌంటర్ వద్ద క్యూ పెరిగిపోతుండడంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఓపీకి ఎదురుగా.. ఎమర్జెన్సీ విభాగం వెనుక వైపున మరో ఓపీ కౌంటర్ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓపీని కేవలం మహిళలకు కేటాయించి.. కొత్తగా ఏర్పాటు చేసే ఓపీని పురుషులకు కేటాయించే ఆలోచన చేస్తున్నారు. ఒక్కో ఓపీ కౌంటర్ వద్ద ఇద్దరు ఉద్యోగులను నియమించే అవకాశం ఉంది. కొన్నాళ్ల పాటు రోగుల తాకిడిని గమనించి ఆ తర్వాత ఇందుకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.