అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ మరోమారు ఉద్యోగులకు హెచ‍్చరికలు జారీ చేశారు. ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్ రావాల్సిందేనని ఆదేశించారు. అయితే, సీఈవో నిర్ణయంపై అసంతృప్తిలో ఉన్న సిబ్బంది ఉద్యోగాలకు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవచ్చంటూ ఇంటర్నల్‌గా జరిగిన సమావేశంలో ఆండీ జెస్సీ పునరుద్ఘాటిస్తూ చెప్పడంతో ఉత్కంఠతకు దారి తీసింది.
ఈ ఏడాది ప్రారంభంలో, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సిందేనని అన్నారు. ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కి తిరిగి రావాలని, సహోద్యోగులతో కలిసి పని చేయాలని భావించగా..మరికొందరు జర్నీ, ఇతర ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకుని ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులు కంపెనీ తీసుకున్న నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవసరం అయితే, మూకుమమ్మడిగా విధులు నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. అమెజాన్ కంపెనీలో ఈ అసమ్మతి పర్వం కొనసాగుతుండగా.. ఆఫీస్‌కు వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగులు రాజీనామాకు మొగ్గు చూపుతున్నారు.
మరికొందరు కంపెనీ తీసుకున్న నిర్ణయం విషయంలో మరోమారు ఆలోచిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఎటు దారి తీస్తుందోనని అమెజాన్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment