వరంగల్‌కు కేసీఆర్ వరాల జల్లు | another educational centre to telangana is warangal city says cm kcr | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు కేసీఆర్ వరాల జల్లు

Published Thu, Jan 7 2016 1:35 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

వరంగల్‌కు కేసీఆర్ వరాల జల్లు - Sakshi

వరంగల్‌కు కేసీఆర్ వరాల జల్లు

    ► నగరాన్ని రాష్ట్రానికి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం కేసీఆర్
     ► సైనిక స్కూలు ఏర్పాటు చేస్తాం..
     ► గిరిజన యూనివర్సిటీ నెలకొల్పుతాం
     ► కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లను కూడా తీసుకొస్తాం
    ► వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీలు మంజూరు చేస్తున్నాం
     ► సంగీత, నాట్య కళాశాలకు భవనాలు నిర్మిస్తాం
     ► 2 నుంచి 3 వేల ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు
     ► 30 వేల డబుల్ బెడ్రూం ఇళ్లతో వరంగల్‌ను
     ► మురికివాడలు లేని నగరంగా మారుస్తాం
 

సాక్షి, హన్మకొండ: వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి విద్యాకేంద్రం (ఎడ్యుకేషనల్ హబ్)గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అనేక విద్యాసంస్థలను నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. మూడ్రోజుల వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారమిక్కడ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘హైదరాబాద్ బాగా కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌ను పెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా తయారు చేస్తాం. అన్ని రకాల ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇక్కడికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. ఇప్పటికే వరంగల్‌కు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లు మంజూరయ్యాయని, కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాయిలో ఓ సైనిక్ స్కూలును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటితోపాటు కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్లను కూడా వరంగల్‌లో నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
 

గిరిజన వర్సిటీ ఇక్కడే..
‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వర్సిటీ ఏర్పాటు కోసం విజ్ఞప్తులు వచ్చాయి. అయితే ఈ జిల్లాలకు మధ్యన ఉండటంతో పాటు రోడ్డు, రైలు కనెక్టివిటీ వంటి అంశాలు వరంగల్‌కు సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి గిరిజన యూనివర్సిటీని వరంగల్‌లో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది’’ అని కేసీఆర్ తెలిపారు. అలాగే స్థల సదుపాయం ఉన్నందున వరంగల్ జిల్లాలో వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీలను మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు కాలేజీల్లో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పత్తి పరిశోధన కేంద్రాన్ని వరంగల్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం వరంగల్‌లో కొనసాగుతున్న సంగీత, నాట్య కళాశాలకు సొంత భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.
 

త్వరలో టెక్స్‌టైల్ పార్కు పనులు
దేశంలోనే అతి పెద్దదైన వరంగల్ మల్టిపుల్ టెక్స్‌టైల్ పార్కు పనులు త్వరలో ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు వరంగల్‌లో తయారయ్యేలా 2 నుంచి 3 వేల ఎకరాల్లో ఈ పార్కును నెలకొల్పుతామన్నారు. భూసేకరణకు రూ.100 కోట్లు మంజూరు చేశామని, జిల్లా కలెక్టర్ ఇందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టారని చెప్పారు. భూ సేకరణ పూర్తయితే.. రెండు, మూడు నెలల్లో పార్కు పనులు ప్రారంభిస్తామన్నారు. టెక్స్‌టైల్ పార్కులోనే ఉద్యోగులకు సకల సదుపాయాలతో టౌన్‌షిప్ నిర్మిస్తామని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కును అనుకున్నట్లుగా అభివృద్ధి చేస్తే వరంగల్ జనాభా మరో నాలుగైదు లక్షలు పెరుగుతుందని పేర్కొన్నారు.
 

మాజీ సైనికులకు వరాలు
మాజీ సైనికులపై సీఎం వరాలు కురిపించారు. మాజీ సైనికుల భార్యల పేరున ఇళ్లు ఉంటే, వాటికి ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో మాజీ సైనికులకు 2 శాతం కేటాయిస్తున్నట్లు చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో పోలీసులు, హోంగార్డులు, మాజీ సైనికులకు కలిపి మొత్తం 10 శాతం వాటాను కేటాయించినట్లు వివరించారు.


30 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు
వరంగల్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ వెల్లడించారు. ‘‘రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో వరంగల్ మురికి వాడలు లేని నగరంగా అవతరిస్తుంది. జిల్లా ప్రజలకు ఒక పిలుపునిస్తున్నా... రాబోయే పదిహేను రోజుల్లో ఎమ్మార్వో ఆఫీసుకానీ, ఈ సేవా ఆఫీసు కానీ, ఆర్డీవో కార్యాలయం కానీ, కలెక్టరు ఆఫీసుకు కానీ ఇళ్లు లేని పేదలంతా దరఖాస్తులు సమర్పించండి. ఎంక్వైరీ చేయిస్తం. ఆ తర్వాత డివిజన్ సభలు జరిపి, లబ్ధిదారులను గుర్తిస్తాం. మొన్న వరంగల్ ప్రజలు ఇచ్చిన తీర్పు గొప్పది. దానికి కానుకగా 30 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను వరంగల్‌కు మంజూరు చేస్తున్నం’’ అని సీఎం తెలిపారు. ఈ ఇళ్లతో వరంగల్ నగరం మురికివాడలు లేని నగరంగా మారుతుందన్నారు. ఈ ఏడాది 15 వేల ఇళ్లు, 2017 నుంచి మరో 15 వేల ఇళ్లు కడతామని తెలిపారు.
 

పది నియోజకవర్గాలకు నీళ్లు
మిషన్ భగీరథ ద్వారా వచ్చే ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 10 నియోజక వర్గాల ప్రజలకు తాగునీరు అందివ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. మెదక్ జిల్లా దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లా మేడ్చల్, వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, నల్లగొండ జిల్లాలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు తాగునీరందిస్తామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement