
గుంటూరు కమిషనర్‌గా అనురాధ
♦ ఉన్నతాధికారుల ఉత్తర్వులు
♦ రెండు నెలలుగా ఇన్‌చార్జిగా కొనసాగుతున్న వైనం
♦ ఎట్టకేలకు పూర్తిస్థాయిలో నియామకం
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్‌గా మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సి.అనురాధను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు కమిషనర్‌గా పనిచేసిన నాగలక్ష్మి ఈ ఏడాది మే నాలుగో తేదీన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో గుంటూరు ఆర్డీ అనురాధకు ఫుల్ అడిషనల్ చార్జి ఇచ్చి ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని నియమిస్తారనే వాదనలు వినిపించినప్పటికీ తాజాగా అనురాధను కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పుకార్లకు తెర పడింది. అనురాధకు 2015లో ఐదు నెలలపాటు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, మూడేళ్లుగా ఆర్డీగా పనిచేస్తుండటంతో నగరపాలక సంస్థపై పూర్తి అవగాహన ఉంది.
నగరాభివృద్ధికి కృషి చేస్తా...
అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుంటూరు నగరాభివృద్ధికి కృషి చేస్తానని అనురాధ చెప్పారు. తనపై నమ్మకంతో కమిషనర్‌గా నియమించిన ఉన్నతాధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నగర ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
మున్సిపల్ ఇన్‌చార్జి ఆర్డీగా రమణి
గుంటూరు మున్సిపల్ ఆర్డీగా పనిచేస్తున్న చల్లా అనురాధను కమిషనర్‌గా నియమించడంతో ఏపీఎండీపీ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఏవీ రమణికి ఇన్‌చార్జి ఆర్డీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న డి.మేరీగోల్డ్ డైమండ్‌ను గుంటూరు మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు.