
సుగర్స్ జీవోపై ఆందోళన
► ఫ్యాక్టరీని ఎపీఐఐసీకి అప్పగించడం దారుణం
►సహకార రంగంలో నడిపించాలి..
► జీవో 162ను వెంటనే రద్దు చేయాలి
► సీపీఎం నాయకుల నిరసన
ఆమదాలవలస :జిల్లాలోని ఏకై క సహకార రంగంలో ఉండే ఆమదావలస సుగర్స్‌ను ఏపీఐఐసీకి అప్పగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 162ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేశారు. ఇందులో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ జంక్షన్ వద్ద జీవోను తగులబెట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నినదించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం జీవో 162ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పర్యటించిన చంద్రబాబునాయుడు సుగర్స్‌ను తెరిపిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తూ జీవోను తేవడం తగదన్నారు. ఏపీఐఐసీకి సుగర్స్ స్థలాలు ఇవ్వడం వెనుక సుట్‌కేసులు మారాయని ఆరోపించారు. కోర్టు తీర్పు కూడా సహకార రంగంలోనే ఫ్యాక్టరీని తెరవాలని పేర్కొందన్నారు. కోర్టు తీర్పు తన ఘనతేనని డప్పు కొట్టిన విప్ కూన రవికుమార్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించే ధైర్యం లేదా? అని నిలదీశారు. ఫ్యాక్టరీని ఏపీఐఐసీకి అప్పగింతలో విప్ రవికుమార్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటనలో ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్టు వెల్లడించినట్టు వివరించారు. ఫ్యాక్టరీని నడిపించేందుకు చర్యలు చేపట్టకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సీపీఎం నాయకు లు కె.నాగమణి, కోనాడ మోహనరావు, మెట్ట కొండయ్య, పంచాది కృష్ణారావు, బొడ్డేపల్లి మోహనరావు, బి.జనార్ధనరావు, వడ్డాది ఆదినారాయణ, బి.రాజారావు, కార్మి కులు, రైతులు పాల్గొన్నారు.