రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పలేదు | AP CM Chandra babu fires on capital farmers | Sakshi
Sakshi News home page

రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పలేదు

Published Tue, Jan 26 2016 2:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పలేదు - Sakshi

రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పలేదు

♦ రాజధాని రైతుల రుణాల మాఫీపై సీఎం
♦ రూ.లక్షన్నర రుణాన్ని మాఫీ చేశాం.. అంతే
♦ అంతకుమించి రైతులకు అత్యాశ పనికిరాదు
♦ మా భూమి ఇక్కడే ఉంది...  ఇక్కడే ఉంటామంటే ఎలా?
♦ ఆధునీకరణలో భాగంగా ఈ ఊర్లన్నీ మారతాయి
♦ అమరావతిలో విద్యుత్‌తో వాహనాలు నడిచే వ్యవస్థ
♦ వ్యవసాయానికి కార్పొరేట్ భాగస్వామ్యం
♦ 25 నుంచి 30 పంటలకు మార్చి ఒకటి నుంచి అమలు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో:  ‘‘రాజధాని రైతుల రుణాలన్నీ రద్దు చేస్తామని ఎక్కడ చెప్పాం? నీకు ఒక్కడికే కల్లోకి వచ్చి చెప్పానా? నీలాంటి వాళ్లు ఒకరిద్దరుంటే అంతా నాశనం అవుతుంది. రూ.లక్షన్నర రుణాన్ని వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌గా మాఫీ చేస్తామని చెప్పాం, ఆ మేరకు చేశాం. నేను చేస్తానన్న రుణమాఫీ చేసేశా... అంతే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు  కుండబద్దలు కొట్టారు. ఆయన తన దావోస్ సదస్సు అనుభవాలు వివరించేందుకు సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయనే హామీ అమలు కాలేదని ఒక విలేకరి ఈ సందర్భంగా ప్రశ్నించడంతో చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని నీకు ఒక్కడికే కల్లోకి వచ్చి చెప్పానా? అంటూ ఎగతాళి చేశారు. విచ్చలవిడిగా రాస్తే ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు.

తాను చేస్తానన్న రుణమాఫీ చేసేశానని, రైతులకు అత్యాశ పనికిరాదని వ్యాఖ్యానించారు. సీఎం మాటలతో విలేకరులు అవాక్కయ్యారు. ఎన్నికల ముందు రాష్ర్టంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ఊరూరా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ నెరవేర్చకపోగా ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులకు కూడా మొండిచేయి చూపించడంతో విలేకరుల నోట మాట రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. మా భూమి ఇక్కడే ఉంది మేం ఇక్కడే ఉంటామంటే ఎలా కుదురుతుందని రాజధాని ప్రాంత రైతులను ఉద్దేశించి ప్రశ్నించారు. రోడ్లు, ప్రాజెక్టులు మా ఊరి పక్కనే ఉండాలి, కానీ మా ఊళ్లోకి రాకూడదంటే ఎలా? అని అడిగారు. ఆధునీకరణలో భాగంగా ఈ ఊర్లన్నీ మారతాయని స్పష్టంచేశారు. సీఆర్‌డీఏ రీజియన్‌లో వ్యవసాయ జోన్లపై జరుగుతున్న ఆందోళన గురించి విలేకరులు ప్రస్తావించగా... భూమిని ఇవ్వడానికి ముందుకురాని రైతులు అగ్రి జోన్ పెడితే వద్దంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాజెక్టు దెబ్బతింటే మొదట రైతులు, ఆ తర్వాత రాష్ట్రం నష్టపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

 నాది విలాస పర్యటన కాదు..
 దావోస్ విలాస పర్యటన కాదని, ఏపీని ప్రమోట్ చేసే పర్యటనని సీఎంచెప్పారు. సదస్సులో సోలార్ సెల్స్ సామర్థ్యం ఇంకా పెరగాలనే అభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. రాబోయే రోజుల్లో వాహనాలన్నీ విద్యుత్‌తో నడిచే వ్యవస్థను తీసుకొస్తామని, తొలి దశలో అమరావతి నగరంలో దీన్ని ప్రవేశపెట్టే యోచన ఉందని తెలిపారు. తాను 16 దేశాలకు చెందిన 58 మందితో సమావేశమయ్యాయని, 38 కంపెనీల సీఈఓలతో విడిగా భేటీ అయ్యాయని తెలిపారు. ప్రపంచమంతా గుర్తించేలా ఏపీని ప్రమోట్ చేశామన్నారు. రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ ఇచ్చిన ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులున్నాయని అంగీకరించారు. అందుకే కొత్త ప్రతిపాదనలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

 చంద్రబాబుకు ఆదర్శ సీఎం పురస్కారం
 ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ నెల 30న పూణెలో జరిగే ఆరో ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
 
 వ్యవసాయంలోనూ కార్పొరేట్ భాగస్వామ్యం

 వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్ భాగస్వామ్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 25 నుంచి 30 పంటలను ఎంపిక చేసి విత్తు నాటే దగ్గర నుంచి చేతికొచ్చి అమ్ముకునేవరకూ అన్ని పనుల్నీ కార్పొరేట్ పద్ధతిలో చేయించే ఈ విధానాన్ని.. మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. దావోస్‌లో జరిగిన ఒక సదస్సులో ‘న్యూ విజన్ ఫర్ అగ్రికల్చర్’ అనే అంశంపై చర్చ జరిగిందని, దాన్ని ఇక్కడ అమలు చేయనున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement