హోదాతోనే ఏపీ అభివృద్ధి
-
జేవీవీ చర్చావేదికలో వక్తలు
నెల్లూరు(అర్బన్):
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తేనే అభివృద్ధి చెందుతుందని లేదంటే తీరని నష్టం జరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక హరనాథపురంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా వల్ల లాభమా.. ప్యాకేజీలతో లాభమా’ అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. చర్చను ప్రారంభించిన జేవీవీS జిల్లా అధ్యక్షుడు పి.బుజ్జయ్య మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయన్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా 10 ఏళ్లు కావాలని పట్టు బట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, హోదాను సాధించి తీరుతామని చెప్పిన చంద్రబాబులే నేడు హోదా వల్ల లాభం లేదని అబద్ధాలు చెప్పడం అన్యాయమన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్వీ చలపతి మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హోదా అనేది రాష్ట్రానికి సంజీవిని లాంటిదన్నారు. హోదావల్ల 90 శాతం గ్రాంటు వస్తుందని, అనేక రాయితీలు వస్తాయని, పరిశ్రమలు నెలకొల్పబడి లక్షలాది ఉద్యోగాలు రావడం ఖాయమన్నారు. ప్యాకేజీల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు. విభజన చట్టంలోని అంశాలనే తాము ఏదో గొప్పగా ప్యాకేజీ రూపంలో ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పులిగండ్ల శ్రీరాములు మాట్లాడతూ బీజేపీ, టీడీపీలు కలిసి ప్రజలను నిలువునా ముంచేశాయన్నారు. విభజన చట్టంలో ఆనాడు హోదా గురించి లేదని చెబుతున్న వెంకయ్యనాయుడుకు కనీస ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. అప్పుడు చట్టంలో లేకపోతే బలమున్న బీజేపీ ఇప్పుడు హోదాపై ఎందుకు చట్టం చేయలేకపోతుందని నిలదీశారు. న్యాయవాది భార్గవ్ రామ్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కలసి హోదా కోసం పోరాటం చేయాలన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవకోటేశ్వరరావు, న్యాయవాదుల సంఘం (ఐలు) నాయకులు బాలసుబ్రహ్మణ్యం, అంకయ్య, సింహపురి సామాన్యుడు అనే స్వచ్ఛందసంస్థ అధ్యక్షుడు మనోహర్, బీటీఏ నాయకులు కృష్ణారావు, వేణుగోపాల్, జేవీవీ రాష్ట్ర నాయకులు శంకరయ్య, సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, మెడికల్ రెప్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ కృష్ణారెడ్డి, గిరిజన సంఘం నాయకులు ప్రభాకర్, డాక్టర్లు ఎమ్వీ రమణయ్య, శ్రీనునాయక్, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, ఇంకా పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.