సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టామని, ఇందులో భాగంగా మంత్రి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా జారీచేసిన ఉత్తర్వులను పలుచోట్ల టీచర్లు దగ్థం చేశారని ఫాప్టో, జాక్టో నేతలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మే1న సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలలను మూతవేయబోమని, బదిలీలకు పెర్ఫార్మెన్స్ పాయింట్లు ఉండవని వెబ్ కౌన్సెలింగ్ ఉండదని మంత్రి గంటా శ్రీనివాసరావు తమకు హామీ ఇచ్చారని కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆ వేదికల నేతలు బాబురెడ్డి, హృదయరాజు పేర్కొన్నారు. సంఘాలు డిమాండ్లను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా 2500 ప్రాథమిక పాఠశాలలు మూతవేస్తుండడంతో దాదాపు 40 వేల మంది విద్యార్ధులు డ్రాపవుట్లుగా మారుతున్నారని చెప్పారు.
హైకోర్టు తీర్పుపై ఆందోళన వద్దు: పీఆర్టీయూ
విద్యాశాఖలో పదోన్నతులు జడ్పీ టీచర్లకు వర్తింపచేసే అంశంపై ప్రభుత్వ టీచర్లు వేసిన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీరాజ్ టీచర్లు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులురెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కమలాకర్‌రావు, శ్రీనివాసరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తీర్పుపై తదుపరి న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సాధిస్తామన్నారు. లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ కాలేదన్న కారణంతో హైకోర్టునుంచి ఈ తీర్పు వచ్చిందని, దీని ఆధారంగా ఏకీకృత సర్వీసుల కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధిస్తామని చెప్పారు.
లెక్చరర్లకు షరతులు లేని అభ్యర్ధన బదిలీలు
ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్లకు షరతులు లేని అభ్యర్ధన బదిలీలకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా నాలుగేళ్లుగా నిలిచిపోయిన ప్రిన్సిపాళ్ల పదోన్నతులు చేపట్టాలన్నారు.
రిజిస్టర్డ్ సంఘాల నాయకులకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలి: ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం టీచర్ల బదిలీల్లో రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులకు ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయసంఘం అధ్యక్షుడు సామల సింహాచలం ఒక ప్రకటనలో కోరారు.