రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పార్టీలకతీతంగా పోరాడి సాధించుకోవాలని శాసనమండలి చైర్మన్ చక్రపాణి అన్నారు.
► శాసనమండలి చైర్మన్ చక్రపాణి
► అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు
సింహాచలం: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పార్టీలకతీతంగా పోరాడి సాధించుకోవాలని శాసనమండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమన్నారు.
అందరూ ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. కేంద్రంలో మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ సామరస్యమైన చర్చలతో కూడా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు కల్పిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వారెవరైనా అర్హులేనని చక్రపాణి బదులిచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం.. దాని పని అది చేసుకుపోతుందన్నారు.
ముందుగా చక్రపాణి దంపతులకు ఆలయ ధ్వజ స్తంభం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన జరిపారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఈవో కె.రామచంద్రమోహన్ అందజేశారు.