రాష్ట్ర హోం సెక్రటరీకి ఏపీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ లీగల్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసుకు కౌంటర్‌గా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విజయవాడ కోర్టు ఆదేశాలను సిట్ అధికారులు గురువారం తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించారు. నోటీసులివ్వడానికి సిట్ బృందం తెలంగాణ సచివాలయానికి రావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ట్యాపింగ్‌కు సంబంధించిన అంశాలతో కూడిన డేటాను నాలుగు కంపెనీలు సీల్డ్ కవర్లలో విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశాయి.
25 ఫోన్ నంబర్లకు సంబంధించిన అంశాలను వాటిలో పొందుపరిచినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ఆదేశాలు, ఇతర డేటా వివరాలు సర్వీసు ప్రొవైడర్ల వద్ద ఉండే అవకాశం లేదని సిట్ భావిస్తోంది. ట్యాపింగ్ ఆదేశాలు తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా వెళ్లినట్లు, ఆయన వద్ద మరికొంత డేటా సైతం ఉన్నట్లు సిట్ ఇటీవల విజయవాడ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు, డేటాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భద్రంగా ఉంచాలని, కోర్టు కోరినప్పుడు అందించేలా ఆదేశించాలని ఇందులో కోరారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నోటీసుల్ని తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించడానికి సిట్ ప్రత్యేక బృందం గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఆయన కార్యాలయానికి వెళ్లింది.
సిట్ ద్వారా నోటీసుల్ని అందుకున్న అనంతరం రాజీవ్ త్రివేది మీడియాతో మాట్లాడుతూ ‘న్యాయస్థానం ఆదేశాలను సిట్ బృందం అందించింది. కోర్టు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం. ఎప్పుడు కోరితే అప్పుడు మా వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తాం’ అని చెప్పారు. ఏపీ సిట్ బృందం నోటీసులివ్వడానికి తమ హోం సెక్రటరీ కార్యాలయానికి వచ్చినట్లు తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తెలియడంతో వారంతా ఆ కార్యాలయం ఉన్న డి-బ్లాక్ దగ్గర గుమిగూడారు. నోటీసులు ఇచ్చి తిరిగి వస్తున్న సిట్ అధికారులు మీడియాతో మాట్లాడుతుండగా ఉద్యోగులు అభ్యంతరం చెప్పారు. సిట్ బృందంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడ నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సచివాలయ భద్రతాధికారులు ఉద్యోగుల్ని అదుపు చేసి సిట్ అధికారులను వాహనాలు ఎక్కించి పంపారు. అంతకుముందు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్య డాక్యుమెంట్లను, సమాచారాన్ని తొలగించకుండా తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాలని సిట్‌ను విజయవాడలోని చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్‌లు సీల్డ్ కవర్లలో ఇచ్చిన కాల్ డేటాను హైకోర్టు రిజిస్ట్రార్‌కు కోర్టు పంపింది.
ఏపీపీకి తెలియకుండా పిటిషన్
విజయవాడ పోలీసులు, సీఐడీ, సిట్ అధికారులు కొత్త సంప్రదాయానికి తెర తీశారు. సాధారణంగా ఏ పిటిషన్ అయినా దాఖలు చేసే ముందు సంబంధిత కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)ని సంప్రదించాలి. కోర్టులో ఏపీపీకి తెలియకుండానే తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.