
బాబు కుటుంబానికి రూ.500 కోట్ల ముడుపులు
అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై కోర్టుకు వెళతామని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా మడకశిరలో మట్టి సత్యాగ్రహం నిర్వహించిన అనంతరం రాయలసీమ వెనుకబాటుతనంపై విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ ముగ్గురూ స్పందించాలన్నారు. లేకపోతే కోర్టులో కేసు వేస్తామన్నారు.
పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి రూ.500 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో నిర్వహిస్తున్న మట్టి సత్యాగ్రహానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని, కన్నతల్లి, సొంత ఊరును విస్మరించే నైజం ఆయనదని రఘువీరా విరుచుకుపడ్డారు. సీఎంకు అమరావతి తప్ప ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని ఆయన విమర్శించారు.
2015కి పూర్తి కావల్సిన ప్రాజెక్టులకు అతీగతీ లేదన్నారు. ఏపీకి ప్యాకేజీ విభజన చట్టంలోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పోటీలు పడి మరీ ప్రత్యేక విమానాలు వేసుకుని తిరుగుతున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. తమ పర్యటనలకు వందల కోట్లు తగలేస్తున్నారని, దేశాలు తిరిగితే పరిశ్రమలు రావని, రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు వస్తాయని ఆయన అన్నారు.