అ‘పూర్వ’ సమ్మేళనం! | apoorva meeting | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ సమ్మేళనం!

Published Mon, Aug 15 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

అ‘పూర్వ’ సమ్మేళనంలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

అ‘పూర్వ’ సమ్మేళనంలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

  • పాతికేళ్ల తరువాత కలుసుకున్న క్రాంతి కళాశాల విద్యార్థులు
  • పొన్నెకల్‌ (ఖమ్మం రూరల్‌): ఐదేళ్లు కాదు.. పదేళ్లు కాదు.. పాతికేళ్ల క్రితం ఖమ్మంలోని క్రాంతి జూనియర్‌ కళాశాలలో కలిసి చదువుకున్న నాటి విద్యార్థులు.. ఇన్నేళ్ల తరువాత ఆదివారం కలుసుకున్నారు. ఆనందానుభూతులను, మధుర జ్ఞాపకాలను నెమరేసుకన్నారు. కష్టసుఖాలను కలబోసుకున్నారు. రోజంతా హ్యాపీ హ్యాపీగా గడిపారు. చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసుకుని నాటి గురువులను ఆహ్వానించారు. సాయంత్రం వరకు సందడి చేశారు. మొక్కలు నాటారు. మరువలేని, మరపురాని మధురానుభూతులనెన్నింటినో మదిలో మూటకట్టుకుని మళ్లీ కలుద్దామంటూ పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ అ‘పూర్వ’ సమ్మేళనానికి పొన్నెకల్‌లోని అనీబిసెంట్‌ బీఈడీ కళాశాల వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు నర్సింహారావు, వీరారెడ్డి, విఎల్‌.రావు, భాస్కర్‌రావు, రమాదేవి, మధుసూధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

    • ఓహ్‌.. ఎంత ఆనందంగా ఉందో..!
    • విజయ్, పూర్వ విద్యార్థి

    ఎక్కడో పుట్టాం. ఎక్కడో పెరిగాం. ‘క్రాంతి’లో చదివాం. ఎక్కడెక్కడో స్థిరపడ్డాం. ఇన్నేళ్ల తరువాత ఈ రోజిక్కడ కలిశాం. ఓహ్‌.. ఎంత ఆనందంగా ఉందో..! అప్పుడు మా ఇంటర్‌లో 106 మందిమి ఉండేవాళ్లం. అనేకమందిమి అనేకానేక రంగాల్లో స్థిరపడ్డాం. మనం ఎక్కడున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. అందరం కలిసి ఇతరులకు చేతనైనంత సాయం చేద్దాం.

    • మరువలేనిది... మరపురానిది..!
    • యు.మహేష్, పూర్వ విద్యార్థి

    ఈ కలయిక మరువలేనిది.. మరపురానిది. నా సహాధ్యాయులను, స్నేహితులను, గురువులను అందరినీ ఇలా ఒకేచోట కలుసుకోవడం.. చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది. ఆ రోజుల్లో మమ్మల్ని మా గురువులు తమ కుటుంబ సభ్యుల్లాగా ఆప్యాయంగా చూసుకున్నారు. ఈ ఆదివారాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. మరోసారి ఇలా కలుసుకునే రోజు కోసం ఎదురుచూస్తుంటాను.

    • గురువుల స్ఫూర్తితోనే కళాశాల నెలకొల్పా
    • ఎ.జితేందర్‌రెడ్డి, పూర్వ విద్యార్థి

    మేం ఇంటర్‌ చదివే రోజుల్లో మా గురువులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా బోధించారు. జీవితంలో ఎలా స్థిరపడాలన్న దానిపై కూడా అవగాహన కల్పించారు. అదే స్ఫూర్తితో నేను కూడా హన్మకొండలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేశా. నేను ఉన్నత స్థితికి చేరడానికి నాటి గురువులు నింపిన స్ఫూర్తే కారణం.

    • ఇంతకంటే ఇంకేం కావాలి..?!
    • మువ్వా శ్రీనివాసరావు, క్రాంతి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

    మా వద్ద చదువుకున్న పిల్లలు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో మంచి స్థితిలో ఉన్నారని వింటుంటే.. పట్టరానంత సంతోషంగా ఉంది. జీవితంలో ఇంతకు మించిన ఆత్మ సంతృప్తి ఇంకేముంటుంది? మాకు ఇంతకంటే ఇంకేం కావాలి?! ఖమ్మంలోనే మొట్టమొదటగా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలను కేవలం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే నెలకొల్పాం. అది నెరవేరడం గర్వంగా ఉంది.

    • జి.రవికుమార్, ఇంగ్లిష్‌ లెక్చరర్‌

    నా వద్ద ఇంగ్లిష్‌ పాఠాలు చదువుకున్న విద్యార్థులు.. ఆయా రంగాల్లో ఉన్నతంగా నిలవడాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పదుల సంఖ్యలో ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాలు చేయడం, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు స్థాపించడం ఎంతో సంతోషంగా ఉంది. స్నేహపూర్వకంగా మెలిగాం. ఇప్పుడు వారి ఉన్నతిని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నా.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement