త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్ | appsc will release group-2 exam notification | Sakshi
Sakshi News home page

త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్

Published Thu, Oct 27 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్

త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్

త్వరలో 750 గ్రూప్-2 పోస్టుల భర్తీ
గ్రూప్-2 సిలబస్ ఖరారు
తాజా పరిణామాల అంశాల చేరిక
2011 గ్రూప్-1 తప్పులపై కమిటీ నివేదికలకు ఆమోదం
ఏపీపీఎస్సీ పాలకవర్గ సమావేశం


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా కొత్తగా 750 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి సిలబస్‌ను కమిషన్ ఖరారు చేసింది. సిలబస్‌పై సబ్జెక్టు నిపుణుల కమిటీలు సమర్పించిన నివేదికలను ఏపీపీఎస్సీ ఆమోదించింది. ఏపీపీఎస్సీ పాలకవర్గ సమావేశం గురువారం హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో జరిగింది.  750 గ్రూప్-2 పోస్టుల భర్తీకి వీలుగా ఏపీపీఎస్సీ ఇదివరకు సిలబస్‌ను రూపొందించింది. రాష్ట్ర విభజన ఇతర పరిణామాలతో ఇంతకు ముందు ఉన్న గ్రూప్2 సిలబస్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయించి కొత్త సిలబస్‌ను ఏపీపీఎస్సీ తయారు చేయించింది. దీన్ని గతంలో తన అధికారిక వెబ్‌సైట్లో పొందుపర్చగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

దీంతో ఏపీపీఎస్సీ ఆ సిలబస్‌లో మార్పులు చేర్పులకు వీలుగా సబ్జెక్టులు, పేపర్ల వారీగా నిపుణుల కమిటీలను నియమించింది. ఈ కమిటీలు తాజాగా నివేదికలు అందించగా ఏపీపీఎస్సీ పాలకవర్గ సమావేశం ఆమోదించింది. పునరుక్తులు తొలగించడంతో పాటు జాతీయస్థాయి పరిణామాలపై కొత్త అంశాలు చేర్చినట్లు ఛైర్మన్, ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ వివరించారు. సిలబస్ ఖరారవ్వడంతో నెలాఖరులోగా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలచేయాలని చర్చించారు. ఛైర్మన్ ఉదయ్ భాస్కర్, సభ్యులు సీతారామరాజు,  ప్రొఫెసర్ గుర్రం సుజాత, ప్రొఫెసర్ జి.రంగ జనార్ధన, కె.విజయకుమార్, ప్రొఫెసర్ కె.పద్మరాజు , రూప సమావేశంలో పాల్గొన్నారు.

ఆ ప్రశ్నలకు అందరికీ మార్కులు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇటీవల 2011 గ్రూప్1 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ తిరిగి నిర్వహించడం తెలిసిందే. ఈ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ఇటీవల ప్రారంభమైంది. ఈ పరీక్షల్లోని ప్రశ్నలపై ఏపీపీఎస్సీకి పలువురు అభ్యర్ధులనుంచి అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా పేపర్-5లో సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయని అభ్యర్ధులు చెప్పగా.. ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీలను నియమించి అధ్యయనం చేయించింది. ఈ నివేదికలపై సమావేశంలో సభ్యులు చర్చించారు. తప్పులకు సంబంధించిన లోటుపాట్ల వల్ల కొన్ని ప్రశ్నలను తొలగించడం, కొన్నింటికి అభ్యర్ధులందరికీ మార్కులు కలపడం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement