అప్పుల్లేవ్.. తిప్పలే
అప్పుల్లేవ్.. తిప్పలే
Published Tue, Feb 14 2017 1:26 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
ఏలూరు (మెట్రో) : కొత్త రుణాలు అందక.. పాత రుణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచే వ్యవస్థ క్రమంగా బీటలువారుతోంది. సంఘాల పటిష్టత కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సిబ్బంది మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మరోవైపు రుణాలు అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 65 వేల మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు సగం సంఘాలకు ఇప్పటికీ రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.1,200 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.660 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 2015–16 ఆర్థిక సంత్సరంలో రూ.వెయ్యి కోట్లను రుణాలివ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో మహిళా సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్యం మేరకు రుణాలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రçస్తుత ఆర్థిక సంవత్సరం నెలన్నర రోజుల్లో ముగిసిపోనుంది. ఈలోగా రూ.540 కోట్లను రుణాలుగా ఇచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. మొండి బకాయిలను తగ్గించామని అధికారులు పేర్కొంటున్నా.. ఇంకా వసూలు కావా ల్సిన మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంది.
చర్యలు చేపడతాం
జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.660 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించాం. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
– కె.శ్రీనివాసులు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్
Advertisement