‘అరబిందో’ భూమిపై డీఎల్‌పీవో విచారణ
‘అరబిందో’ భూమిపై డీఎల్‌పీవో విచారణ
Published Mon, Mar 27 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
తిమ్మాపురం (కాకినాడ రూరల్) : తిమ్మాపురం పంచాయతీకి చెందిన రెండు ఎకరాల భూమిని 2000లో అప్పటి సర్పంచ్ కర్రి ఆదిలక్ష్మి అరబిందో సొసైటీ ట్రస్టుకు అతి తక్కువ ధరకు ఇచ్చారని దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ ప్రస్తుత సర్పంచ్ అనుసూరి జగ్గారావు, ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణమూర్తి చేసిన ఫిర్యాదుపై సోమవారం డీఎల్‌పీవో నాగలత తిమ్మాపురంలో విచారణ చేపట్టారు. రికార్డులను తనిఖీ చేసిన అనంతరం ఆమె భూమిని పరిశీలించారు. డీఎల్‌పీవో తెలిపిన వివరాల ప్రకారం.. 2000లో అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ చెల్లప్ప ఆదేశాలపై అప్పటి కలెక్టర్ సతీష్‌చంద్ర ఉత్తర్వులు ఇవ్వడంతో డీపీవో శ్రీధర్‌రెడ్డి తిమ్మాపురంలో అరబిందో సొసైటీ ట్రస్టుకు 2 ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చినట్టు తీర్మానాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. దీనిపై అప్పటి పంచాయతీ పాలకవర్గం తీర్మానం నంబర్ 30 ప్రకారం లే అవుట్ నంబర్ 34/98లోని సామాజికి స్థలం ఎ. 0.56 సెంట్లు, లేఅవుట్ నంబర్ 130/98లోని సామాజిక స్థలం ఎ.0,58 ట్లు మొత్తం ఎ1.14 సెంట్లు భూమిని అరబిందో సొసైటీకి అప్పగించినట్టు తీర్మానాలు రాశారు. ఈ భూమి సరిపోదని స్కూల్‌కు ఆట స్థలం కావాలని దీనికి సంబంధించి మొత్తం 2 ఎకరాల భూమి కావాలని దరఖాస్తు చేయడంతో పంచాయతీ పాలక వర్గం ఎల్‌పీనంబర్ 34/98లో రూ. 60 అడుగు రోడ్డు, 40 అడుగుల రోడ్డు మధ్య ఉన్న 0.86 సెంట్లు భూమి అరబిందో సొసైటీకి ఇచ్చారు. అరబిందో సొసైటీ ట్రస్ట్‌కు భూమిని బదలాయించినా నేటికీ వారు ఆ భూమిని ఏ విధంగాను వినియోగించలేదన్నారు. అప్పట్లో సొసైటీకి భూమి గజాల్లో అమ్మాల్సి ఉండగా కేవలం ఎకరాల్లో అమ్మారని దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం నష్టపోయిందని ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్‌లు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రికార్డుల పరిశీలనకు వచ్చానని నాగలత తెలిపారు. అప్పట్లో ఈ భూమికి సంబంధించిన ఎల్‌పీలు, తీర్మానాలు తప్ప మరే ఇతర రికార్డులు సక్రమంగా లేవని, పూర్తిస్థాయిలో రికార్డులు సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావును డీఎల్‌పీవో ఆదేశించారు. ఇప్పటికైనా పోయింది ఏమీలేదని ఆ భూమిని తిరిగి తీసుకొనే అధికారం పంచాయతీ పాలకవర్గానికి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే దరిమిలా ఓ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చి భూమిని కేటాయించాలని కోరితే ప్రస్తుతం ఈ భూమిని ఏ విధంగా తిరిగి తీసుకోవాలనే దానిపై కూడా పునరాలోచించాల్సిన ఆవశ్యకతపై కూడా అధికారులు చర్చించారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని డీఎల్‌పీవో నాగలత తెలిపారు. ఈ భూమిని తిరిగి పంచాయతీకి బదలాయించాలని ఉపసర్పంచ్ బెజవాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈవోపీఆర్డీ పి.మణీశ్వరరావు, సర్పంచ్ అనుసూరి జగ్గారావు, ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Advertisement