సాయుధ దళాల సేవలు జాతి మరువదు
జేసీ సత్యనారాయణ
కాకినాడ క్రైం: దేశ భద్రత కోసం సాయుధ దళాలు చేస్తున్న వీరోచిత సేవలు జాతి ఎన్నటికీ మరువదని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సత్యనారాయణ తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని çపురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జెడ్పీ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద çపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరక్షణలో ఎంతోమంది వీరజవానులు తమ ప్రాణాలనుసైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తున్న సాయుధ దళాలు, అమర జవానుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అందరూ తోడ్పాటునందించాలని కోరారు. ప్రజలు ఇచ్చే విరాళాలు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమం కోసం వెచ్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాయుధ దళాల సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం విద్యార్థులు, సిబ్బంది జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారి కపుల్ ఎస్కే యాదవ్, కేడెడ్ సార్జంట్ ఎస్.సాయిచరణ్‌రాజ్, కాకినాడ ఆర్డీవో అంబేడ్కర్, విశ్రాంత సైనికోద్యోగుల హెల్ప్‌లైన్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.శంకరరావు, ఏ. సూర్యారావు, ఉపాధ్యక్షుడు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి ఎస్.రామారావు, కోశాధికారి బి.శంకర్ పాల్గొన్నారు.