సమస్యలపై కదంతొక్కిన ఆశా వర్కర్లు
సమస్యలపై కదంతొక్కిన ఆశా వర్కర్లు
Published Mon, Dec 19 2016 11:58 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
కాకినాడ సిటీ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రూ.5 వేలు వేతనం ఇవ్వాలని, 104, ఇతర కార్యక్రమాల బకాయి పారితోషికాలు చెల్లించాలని, పని భద్రత, పీఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాదబీమా సౌకర్యాలు కల్పించాలని, నాలుగు సంవత్సరాల యూనిఫాం అలవెన్స్ వెంటనే చెల్లించాలని, ఎన్‌హెచ్‌ఎంకు 2017–18 సంవత్సర బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ నినదించారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నాయని విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఎంతో ప్రాముఖ్యమైన మాతా, శిశు మరణాలు తగ్గించడానికి, గర్భిణీ, బాలింతల సంరక్షణ చూస్తున్న ఆశా వర్కర్లకు అసలు వేతనమే ఇవ్వకుండా అరకొర పారితోషికాలు ఇస్తూ అన్నిరకాల పనులు చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్స్‌కు ఏవిధమైన వేతనం నిర్ణయించకుండా ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందని మండిపడ్డారు. ధరలు అధికంగా పెరిగి కుటుంబాన్ని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కనీసవేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, అధ్యక్షురాలు బి.ఎస్తేరురాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.బేబిరాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement