తిరుపతి అర్బన్ తహశీల్దార్‌పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అలిపిరి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఆటోనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీరాములు ఈ సంవత్సరం మార్చి 18వ తేదీన అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని ఆందోళన చేపట్టారు.
ఈ సమయంలో అక్కడున్న అర్బన్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు మరో 11మంది వీఆర్‌వోలు, ఆర్‌ఐలు చూస్తుండగా ఆందోళన చేస్తున్న తనను కులం పేరుతో దూషించారని శ్రీరాములు డీజీపీ జేవీ రాముడుకు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు అర్బన్ తహశీల్దార్‌పై ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన జరిగింది ముత్యాలరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో కావడంతో ఈ కేసును ఎమ్మార్‌పల్లి స్టేషన్‌కు బదిలీ చేస్తామని ఎస్సై తెలిపారు.